ఓ ప్రైవేట్ బ్యాంకు చేసిన నిర్వాకానికి.. నిర్మాణదశలో ఉన్న ఓ ఇంటిలో 50 మంది చిక్కుకున్న ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. మీడియా చొరవతో వారు బయటపడ్డారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాము గంటలపాటు గృహనిర్బంధంలో ఉండాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
దిల్లీలోని రోహిణి ప్రాంతం సెక్టార్ 25లో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. యజమానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా... కొంత మంది బ్యాంకు అధికారులు... పోలీసుల సమక్షంలోనే ఇంటికి సీల్ వేశారు. రుణం చెల్లించకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.
సీల్ వేసే సమయంలో నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ఇంట్లోనే ఉన్నారు. వారిలో మహిళలూ, చిన్నారులూ ఉన్నా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. బాధితులు సహాయం కోరినా పోలీసులు స్పందించలేదు. కొన్ని గంటలపాటు వారు ఆ ఇంట్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చివరకు వారు మీడియాను ఆశ్రయించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బాధితులు ఇంటి నుంచి బయటపడ్డారు.
"కనీసం పిల్లల మీదైనా దయ చూపించండి. వీడియోలు తీసుకోండి. వీడియోలు తీసుకొని ఏం చేస్తారు. మేము మీకు వింతగా, వినోదంగా కనిపిస్తున్నామా? మేము పనిచేస్తున్నాం. కింద సీల్ చేసి వెళ్లిపోయారు. ఎవరు మూసేసి వెళ్లిపోయారంటే ఏం చెప్పాలి? మేమేమో పైన పనిచేస్తున్నాం. కింద బంద్ చేసి వెళ్లిపోయారు. మేం ఎలా చెప్పగలం? మా పిల్లల్ని ఇక్కడే ఉంచి పనిచేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి."
-బాధిత మహిళ
తనకు తెలియకుండా, తన ఆస్తిపై ఎవరో తప్పుడు రుణాలు పొందారని ఇంటి యజమాని ఆరోపించారు.
"చోళమండలం బ్యాంకు అధికారులు, పోలీసులు కుమ్మక్కై నా ఆస్తిని కబ్జా చేశారు. కొంతమంది మోసం చేశారు. కూలీలు పైన పనిచేస్తున్నారు. 20 నుంచి 25 మంది వచ్చి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలోనే చిన్నపిల్లలు, మహిళలూ ఉన్నారు. వారు ఆకలితో చచ్చిపోతే ఎవరిది బాధ్యత?"
-ఇంటి యజమాని
ఇదీ చూడండి:మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్