పంజాబ్ తరన్ తారన్ జిల్లా భిఖీవిండ్‌లో తన ఇంటి సమీపంలోనే శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్వీందర్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు సింగ్‌ని తుపాకీతో కాల్చారని, ఆయన శరీరంలోకి నాలుగు తూటాలను దించి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి సింగ్ ప్రాణాలొదిలారని వైద్యులు చెప్పారన్నారు.
'ఉగ్రవాదుల పనే' :
ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని, తమకు ఎలాంటి శత్రుత్వం లేదని సింగ్ భార్య స్పష్టం చేశారు. తమ కుటుంబంపై 62 ఉగ్రదాడులు జరిగినట్లు ఆమె చెప్పారు. తమకు భద్రత కల్పించాలని చాలాసార్లు డీజీపీ దిన్‌కర్ గుప్తాకి విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకపోయిందని ఆమె వివరించారు.
సిట్ దర్యాప్తునకు ఆదేశం :
ఈ ఘటనపై దర్యాప్తునకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుకు ఆదేశించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఫిరోజ్‌పుర్ డీఐజీ నేతృత్వంలోని సిట్‌కు సూచించారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడిన బల్విందర్‌ను కేంద్రం 1993లో శౌర్యచక్రతో సత్కరించింది.
తరన్ తారన్ జిల్లా పోలీసుల సూచన మేరకు ఏడాది కిందట ఆయనకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించింది. బల్విందర్ కుటుంబంపై ఇదివరకు చాలాసార్లు ఉగ్రదాడులు జరిగాయి. మొదటిసారిగా 1990లో జరగగా.. బల్విందర్ కుటుంబం తీవ్ర పరాక్రమం ప్రదర్శించి దాదాపు 200మంది ఉగ్రవాదులను తరిమికొట్టింది.