బలిరామ్.. హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా సాల్వాహన గ్రామంలో చిన్న కిరాణ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దుకాణం ముందు నుంచే పెద్ద కాలువ పోతుంది. అందులో పడి మనుషులు చనిపోయేవారు. చాలా పశువులు ప్రాణాలు కోల్పోయాయి. అది చూసి బలిరామ్ మనసు చలించింది. తన కళ్లముందు కాలువలో ఏ ప్రాణం పోనివ్వకూడదని నిశ్చయించుకున్నారు.
ఆ కాలువలో మనుషులు పడినా, పశువులు పడినా వెంటనే అందులోకి దిగి వారి ప్రాణాలు రక్షిస్తున్నారు. 42ఏళ్లుగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోటి మనుషులు, పశువులకు పునర్జన్మనిస్తున్నారు బలిరామ్.
1977లో ఆ ప్రాంతంలో కెనాల్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 500 పశువులు, 70 మందికిపైగా మనుషుల ప్రాణాలు కాపాడి అందరి మన్ననలు పొందుతున్నారు బలిరామ్. అంతేకాదు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బయటకు తీసేందుకు బలిరామ్నే ఆశ్రయిస్తుంటారు అధికారులు.
"లైఫ్ జాకెట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, బీబీఎంబీ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. 42 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నా. ఇకపైనా చేస్తాను."
- బలిరామ్
2009లో జీవన్ రక్షా పురస్కారం..
బలిరామ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను 2009లో రాష్ట్రపతి జీవన్ రక్షా పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డు కింద ఆయనకు కొంత ఆర్థికసాయం కూడా అందింది.
24గంటలు అందుబాటులో..
కాలువ పక్కన ఏర్పాటు చేసుకున్న చిన్న కిరాణ కొట్టే ఆయన కుటుంబానికి జీవనాధారం. కాలువలో పడిన వారిని రక్షించేందుకు బలిరామ్ 24 గంటలు అందుబాటులో ఉంటారు.
ఇదీ చూడండి: అక్కడ కారులోనూ హెల్మెట్ ధరిస్తారు.. ఎందుకలా?