జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మరోసారి ఆదివారం ఆంక్షలు విధించారు. ప్రజలను త్వరగా ఇళ్లకు వెళ్లాలని స్పీకర్లతో అధికారులు సూచనలు చేశారు. దుకాణాలను మూసివేయాలంటూ వ్యాపారులను ఆదేశించారు. శ్రీనగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈద్ కోసం ఆంక్షల సడలింపు
ఈద్‌ఉల్ అజాను పురస్కరించుకుని జమ్ముకశ్మీర్ ప్రజలు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మొబైల్,ల్యాండ్‌ఫోన్లపై ఉన్న ఆంక్షలనూ త్వరలోనే ఎత్తివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈద్ రోజున ఆత్మీయులతో మాట్లాడుకునేందుకు 300 టెలిఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
కశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఏర్పాటే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, జిల్లా యంత్రాంగాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అందుబాటులో సౌకర్యాలు
ప్రజలు ఈద్‌ను జరుపుకునేందుకు వీలుగా ప్రభుత్వం బ్యాంకులు, ఏటీఎంలు సహా కొన్ని చోట్ల మార్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. రెండున్నర లక్షల మేకలను అధికారులు సిద్ధం చేశారు. కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, గుడ్లు సహా ఇతర నిత్యావసరాలను ఇళ్లవద్దకే సరఫరా చేసేలా మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ముందస్తుగా జీతాల చెల్లింపు సహా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
గవర్నర్ శుభాకాంక్షలు
ఈద్‌ఉల్ అజా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. శాంతి సామరస్యం, సోదర భావంతో రాష్ట్రం విలసిల్లాలని ఆకాంక్షించారు.
రూ.వెయ్యి కోట్లు నష్టం
కశ్మీర్లో ఆంక్షల కారణంగా రూ.1000 కోట్లు నష్టపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఈద్ సమయం కావటం వల్ల ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రోజుకు సుమారు రూ.175 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో మూడు వందల ప్రత్యేక టెలిఫోన్లు'