బెంగాల్ మిఠాయిలంటే తీపిప్రియులకు మక్కువ ఎక్కువ. కానీ, ఈ మిఠాయిల రుచితో పోటీ పడుతోంది ఖిర్పయిలోని బాబర్షా. మరి ఈ మిఠాయి ప్రత్యేకతేంటో తెలుసుకుందామా..!
275 ఏళ్ల చరిత్ర ఉన్న బాబర్‌షా...ఖిర్పయిలోని పశ్చిమ మెదినీపూర్‌లో దొరుకుతుంది. ఒక్కో మిఠాయి ధర 25 నుంచి 30 రూపాయలు. ఖిర్పయి ప్రధాన రహదారిపై ప్రయాణం చేస్తే బాబర్‌షా ఘుమఘుమలు స్వాగతం పలుకుతాయి. పంచదార పాకంలో ముంచిన ఆ మిఠాయిని ఒక్కసారి నోట్లో వేసుకుంటే...ఎవ్వరైనా ఆహా ఏమి రుచి అనకమానరు. బాబర్‌షా కోసమే ప్రత్యేకంగా ఖిర్పయికి వెళ్లేవారు ఎంతోమంది.
"నేనీ మిఠాయి మొట్టమొదటిసారిగా తింటున్నాను. మెదినీపూర్‌లో దొరికే ఈ స్వీటు గురించి చాలా విన్నాను. కానీ ఎప్పుడూ తినే అవకాశం రాలేదు. నిజంగా చాలా బాగుంది".
-సాగర్ మజీ, వినియోగదారుడు.
స్వీటుషాపుల యజమానులు ప్రత్యేక శ్రద్ధతో బాబర్షా తయారుచేస్తారు. డాల్డా, పిండి, పాలు, నెయ్యి, నీళ్లు, పంచదార పాకం, తేనెతో బాబర్షా తయారవుతుంది. పిండిని డాల్డా, నీళ్లు, పాలతో కలుపుకుని, పలుచని మిశ్రమం తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మరుగుతున్న నెయ్యిలో జారుడుగా పోయాలి. వేగిన తర్వాత తేనెలో గానీ, పంచదార పాకంలో గానీ వేయాలి.
బాబర్‌షా పుట్టుక వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎడ్వర్డ్ బాబర్ష్ అనే బ్రిటిష్ అధికారి పేరుమీదుగా ఈ మిఠాయికా పేరొచ్చిందని కొందరు చరిత్రకారులు చెప్తే... ముఘల్ చక్రవర్తి బాబర్ పేరుమీదుగా బాబర్‌షాగా మిఠాయికి నామకరణం చేసినట్లు మరికొందరు చెప్తారు.
"మా నాన్న, తాత ఈ వ్యాపారమే చేసేవారు. బాబర్షాను తయారుచేసి అమ్మేవారు. ఈ మిఠాయి పేరు వెనక చాలా కథలే ఉన్నాయి. ముఘల్ చక్రవర్తి బాబర్ సేనాధిపతి ఇక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుని, బస చేసినట్లు చరిత్రకారులు చెప్తారు. తేనె, నెయ్యితో తయారుచేసిన ఈ మిఠాయిని ఆకులతో తయారుచేసిన ఓ బుట్టలో పెట్టి ఇచ్చారట. ఆ తీపిపదార్థం తిన్న వెంటనే...చక్రవర్తి పేరు మీదుగా బాబర్‌షా అనే పేరుపెట్టారట. ఖిర్పయిలో బార్గీ వైపు నుంచి దాడి జరగ్గా, దాన్ని ఆపేందుకు ఓ వ్యక్తి మిఠాయి తయారుచేసి, ఎడ్వర్డ్ బాబర్ అనే ఆంగ్లేయుడికి ఇవ్వగా....ఆయన పేరుమీదుగా బాబర్‌షా అనే పేరొచ్చిందని మరికొందరు చెప్తారు".
-అశోక్ విశ్వాస్, మిఠాయి దుకాణం యజమాని.
బాబార్‌షాను ఎంతోమంది ప్రముఖులు రుచిచూశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సిద్దార్థ శంకర్‌రాయ్ బాబర్‌షా తిని మైమరిచిపోయినవారే. ఇంతవరకూ బాబర్షాకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ రాలేదు. తమ మిఠాయిని ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందడం లేదని దుకాణాల యజమానులు, తయారీదారులు వాపోతున్నారు.
" బాబర్షా మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ప్రత్యేకత చాటుకుంది. ఖిర్పయిలో చాలామంది ఈ మిఠాయి కొనుగోలు చేసి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు తమతో తీసుకెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం మాకెలాంటి సహకారం అందడంలేదు".
-అశోక్ విశ్వాస్, మిఠాయి దుకాణం యజమాని.
పశ్చిమ బెంగాలే కాదు...దేశ సరిహద్దులు దాటి, బాబర్‌షా ఎన్నో దేశాలకు చేరింది. ఖిర్పయికి వెళ్లినప్పుడు నోరూరించే బాబర్‌షా తినడం మాత్రం మర్చిపోవద్దు.