అయోధ్య తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నేడు సమావేశం కానుంది. సుప్రీం తీర్పుననుసరించి ఐదెకరాల స్థలం స్వీకరించాలా లేదా అన్న విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జుఫర్ ఫరూకీ తెలిపారు. బోర్డు సభ్యులు రెండుగా చీలిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలోని వందమంది ప్రముఖులు ఈ రివ్యూ పిటిషన్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముస్లిం ప్రముఖుల వ్యతిరేకత..
అయోధ్యపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్ దాఖలు చేసే విషయంపై దేశవ్యాప్తంగా ముస్లిం ప్రముఖుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నటుడు నసీరుద్దిన్ షా, షబానా అజ్మీ సహా దాదాపు వంద మంది ముస్లిం ప్రముఖులు రివ్యూ పిటిషన్‌కు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సంతకాలతో కూడిన నివేదికను విడుదల చేశారు. వివాదాన్ని కొనసాగించడం వల్ల మతాల మధ్య సామరస్యం దెబ్బ తింటుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంతకాలు చేసిన ప్రముఖులలో ముస్లిం పండితులు సహా సామాజిక కార్యకర్తలు, లాయర్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, కవులు, చిత్ర నిర్మాతలు, నటులు, విద్యార్థులు ఉన్నారు.
"చట్టానికి అతీతంగా నమ్మకాలపై ఆధారపడి సుప్రీం తీసుకున్న నిర్ణయం పట్ల భారత ముస్లింలు, రాజ్యాంగ నిపుణులు, లౌకిక సంస్థలు వ్యక్తం చేస్తున్న బాధను మేము పంచుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పు న్యాయపరంగా లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ.. ఈ వివాదాన్ని కొనసాగించితే భారతీయ ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది హానికరం."
-ముస్లిం వర్గాల నివేదిక
దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న తీర్పు వెలువరించింది. రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆదేశించింది సుప్రీం. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమాయిత్ ఉలామ-ఇ-హింద్ ఇదివరకే ప్రకటించాయి.
ఇదీ చూడండి : రాజ్యాంగ నిర్మాణంలో బీఎన్ రావు అవిరళ కృషి