అయోధ్య కేసు వాదించొద్దంటూ బెదిరించారని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓ న్యాయవాదికి ఇలా బెదిరింపులు రావడం ఆమోదయోగ్యం కాదని, ఇలా జరగకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
రాజీవ్ ధావన్ అయోధ్య కేసు విషయంలో ముస్లిం వర్గాల తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును వాదించవద్దంటూ తనకు.. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వస్తున్నాయని ఆయన సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.... ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. అయోధ్య కేసును 22వ రోజు విచారించింది. ఈ సందర్భంగా... తనకు ఫేస్బుక్ ద్వారా బెదిరింపులు వచ్చాయని రాజీవ్ ధావన్ పేర్కొన్నారు. అలాగే తన సహాయకులను న్యాయస్థానం ఆవరణలో కొందరు వ్యక్తులు దూషించారని తెలిపారు.
బెదిరింపుల వ్యవహారంపై ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
"న్యాయవాదులకు బెదిరింపులు రావడం ఆమోదయోగ్యం కాదు. ఇలా జరిగి ఉండకూడదు."
- జస్టిస్ రంజన్ గొగోయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇదీ చూడండి: 'ఆవుల గురించి కాదు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడండి'