అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించిన తరువాత మూడు నుంచి మూడున్నర సంవత్సరాల్లో పూర్తిచేస్తామని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం భక్తులు ఇచ్చే నిధులను కూడా స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
"అక్షరధామ్ ఆలయాన్ని మూడేళ్లలో నిర్మించారు. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని మూడేళ్లలోపే పూర్తి చేశారు. ఈ మహోత్కృష్టమైన రామాలయం కూడా మూడు నుంచి మూడున్నర ఏళ్లలో పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాం."- గోవింద్ దేవ్ మహరాజ్, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి
భక్తుల సహకారంతో.. రామాలయం
'భక్తులు ఆలయ నిర్మాణం కోసం ఇటుకలను పంపేవారు. ఇప్పుడు వారు నగదును విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పెద్ద పెద్ద విరాళాలే కాకుండా, సామాన్యులు ఇచ్చే చిన్నపాటి ఆర్థిక సాయాన్ని కూడా తీసుకుంటాం. ప్రజల నిధులతో, వారి సహకారంతో రామాలయాన్ని నిర్మిస్తాం' అని గోవింద్ దేవ్ అన్నారు.
కమిటీ సూచనల మేరకే...
నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సూచించిన కాలవ్యవధి తరువాత మాత్రమే నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై నిర్ణయం తీసుకుంటామని గోవింద్ దేవ్ స్పష్టం చేశారు.
ఈ కమిటీ 15 రోజుల్లో తన సూచనలు సమర్పించనుంది. ట్రస్ట్ తదుపరి సమావేశం కూడా మరో 15 రోజుల్లో జరగనుంది. అప్పుడే ఆలయ నిర్మాణం తేదీలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: ఫోన్ మాట్లాడుతూ బావిలో పడిన మహిళ.. తర్వాత ఏమైందంటే?