అయోధ్య భూవివాద కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టు గతంలో నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ బుధవారం రోజు మరోసారి తన నివేదికను సమర్పించింది. వాదనల చివరిరోజున... తమ రెండో దశ చర్చలకు సంబంధించిన నివేదికను కోర్టుకు అందించింది. అయోధ్య కేసు వాదనలు ముగించి, తీర్పు వాయిదా వేసిన తరుణంలో కమిటీ నివేదిక సమర్పించడం విశేషం.
అయితే.. ఈ నివేదికలో ఎలాంటి పరిష్కార సూచనలు అందాయన్నది, సంబంధిత పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయా అనేది తెలియరాలేదు.
పరిష్కారం కోసం కమిటీ...
అయోధ్య వివాదంలో రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగించి పరిష్కారం కనుగొనడం కోసం మార్చి 8న మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు. అయోధ్య వివాదంతో ముడిపడిన భాగస్వామ్య పార్టీలతో ఈ కమిటీ వివిధ దశల్లో సంప్రదింపులు జరిపింది.
సయోధ్య యత్నాలకు సంబంధించిన తొలి నివేదికను ఆగస్టు 1న సమర్పించిన అనంతరం... సమస్య పరిష్కారంలో కమిటీ విఫలమైందని భావించిన న్యాయస్థానం రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అనంతరం సమస్య సామరస్యపూర్వక పరిష్కారానికి కమిటీ మరో రౌండు చర్చలు ప్రారంభించేందుకు అనుమతించాలని గత సెప్టెంబర్ 16న కోర్టుకు విజ్ఞప్తి చేశాయి హిందూ, ముస్లిం పక్షాలు.
ఈ క్రమంలోనే ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 16 వరకు 40 రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం కేసు తీర్పును వాయిదా వేసింది. ఇదే సమయంలో కమిటీ తమ సయోధ్య యత్నాలపై బుధవారం రోజు రెండో నివేదిక అందజేసింది.
నివేదిక సమర్పించిన అనంతరం.. సభ్యుల్లో ఒకరైన శ్రీ శ్రీ రవిశంకర్ తమపై నమ్మకం ఉంచినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
''మధ్యవర్తిత్వంపై నమ్మకం ఉంచినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు. ఇందులో భాగస్వాములైనందుకు అన్ని పక్షాలకు ధన్యవాదాలు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో సంప్రదింపులు విలువలకు అనుగుణంగా స్నేహపూర్వక వాతావరణంలో సాగాయి.''
- రవిశంకర్, మధ్యవర్తిత్వ కమిటీ సభ్యులు, ట్వీట్
వివాదాస్పద భూమిపై కేసు...
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: అయోధ్య కేసు తీర్పు వచ్చేది ఆ రోజే..!