మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పుణె, ఔరంగాబాద్, కొంకన్ డివిజన్లలో మూడు రోజుల వ్యవధిలో 48మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నెల 12 నుంచి 15 తేదీల మధ్య కురిసిన వర్షాలకు పుణె డివిజన్ పరిధిలో 29మంది ప్రాణాలు కోల్పోగా.. ఔరంగాబాద్ డివిజన్ పరిధిలో 16మంది, కొంకన్ పరిధిలో ముగ్గురు మృత్యువాతపడినట్టు అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాలతో దాదాపు 3వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 40వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పుణె డివిజన్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. పుణె, షోలాపూర్, సతారా, సంగ్లి, కొల్లాపూర్ జిల్లాల్లో చెరకు, సోయాబీన్, కూరగాయలు, వరి, దానిమ్మ, పత్తి పంటలు 87వేల హెక్టార్లలో దెబ్బతిన్నట్టు తెలిపారు.
అలాగే, ఈ ప్రాంతంలో 1021 పశువులు మృతిచెందాయి. ఔరంగాబాద్ ప్రాంతంలో సోయాబీన్, మొక్కజొన్న, పత్తి, ధాన్యాలు, అరటి, పొద్దు తిరుగుడు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఉస్మానాబాద్ జిల్లాలో 1,36,176 హెక్టార్లలో, నాందేడ్ జిల్లాలో 1,10,685 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజత్ పవార్ సమీక్ష నిర్వహించారు. పంటలతో పాటు ఇళ్లు, ఇతర ఆస్తుల నష్టంపై తక్షణమే నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు
ఇదీ చూడండి:నీట మునిగిన గుడిలో పూజారి ప్రార్థనలు