కంటికి కనబడని అతి సూక్ష్మ వైరస్ కరోనా మానవాళికి విసురుతున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. సామాజిక, ఆర్థిక రంగాల్లో సంక్షోభానికి అంటుకట్టిన వైరస్ విస్తృతిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వచ్చాయి. విపత్తులు ముంచుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ సమాజంలో దురదృష్టవశాత్తూ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గం... దివ్యాంగులు! ప్రభుత్వ విధానాల్లో వీరి ప్రాధాన్యం క్రమంగా కోసుకుపోతోంది. సామూహికంగా బలమైన ప్రాతినిధ్యం లేనందునో, శక్తిమంతమైన ఓటు బ్యాంకుగా రూపాంతరం చెందనందునో వీరి ప్రాథమ్యాలకు, ప్రత్యేక అవసరాలకు వీసమెత్తు విలువ దక్కడం లేదు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఫలితంగా విపత్తులు ఉరిమినప్పుడు వీరు దిక్కులేనివారవుతున్నారు. వికలాంగుల హక్కులను గుర్తించి, వారిని సమాదరించే పరిస్థితి సమాజంలో కొరవడింది. సర్వాంగాలు సక్రమంగా ఉన్న ఆరోగ్యవంతులనే కేంద్రంగా చేసుకొని సౌకర్యాల కల్పన సాగుతోంది. కొవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తమైన సర్కార్లు- దివ్యాంగులకూ సమధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కరోనా కట్టడికి సంబంధించిన సమాచార సేకరణ మొదలు, వైరస్ బారినపడకుండా తమను తాము రక్షించుకొనే చర్యలు తీసుకోవడం వరకు దివ్యాంగులు అడుగడుగునా సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. సాధారణ సందర్భాల్లోనే దివ్యాంగులకు సహాయకుల అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వైరస్ ముప్పు విరుచుకుపడిన అత్యవసర సందర్భాల్లో ఈ అవసరం మరింత పెరుగుతుంది. వైరస్ ప్రబలిన ఈ పరిస్థితుల్లో అంధత్వం బారినపడినవారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు వారిని చేయిపట్టుకు నడిపించాల్సిందే! టెలివిజన్ ఛానళ్లు, రేడియోల ద్వారా కరోనా సందేశాలను తెలుసుకోవడం బధిరులకు సాధ్యం కాదు. కదల్లేని స్థితిలో ఉన్నవారికి ‘వాష్ బేసిన్ల’ దాకా వెళ్ళి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవడం కుదిరే పనికాదు. జన్యుపరమైన కారణాలతో మానసికంగా ఎదగని పిల్లలు, పెద్దలు- ఎవరైనా తినిపిస్తే తప్ప ఆహారం భుజించలేని పరిస్థితుల్లో ఉంటారు. భావప్రకటనపరంగా వైకల్యం ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలను ఎదుటివారికి సరిగ్గా వివరించలేరు. మానసిక వైకల్యం ఉన్నవారికి మరిన్ని సమస్యలు ఉంటాయి. ప్రస్తుతం కరోనా వార్తలను బధిరులకు చేరవేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. తద్వారా ప్రధాన స్రవంతి మీడియా సమాచారం వారికి చేరడం లేదు. ఐరోపా దేశాల్లో బధిరులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.
ఇతరులతో పోలిస్తే వీరికే చేయుత అవసరం...
మధుమేహం, అధిక రక్తపోటు బారినపడే ప్రమాదం దివ్యాంగుల్లో ఎక్కువ. ఈ సమస్యలున్నవారిని కొవిడ్-19 ఇబ్బందిపెట్టే అవకాశాలు అధికమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇతరలతో పోలిస్తే దివ్యాంగులకు మానవీయ సహకారం మరింత అవసరం. తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితులు ఉండటంతోపాటు, ఆహారమూ సరిగ్గా తీసుకోలేరు కాబట్టి వీరిపై సహజంగానే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దివ్యాంగ మహిళలకు తమ పిల్లలు, కుటుంబం గురించిన దిగులు ఎక్కువ కాబట్టి వారూ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. సాధారణ ఆరోగ్య సమస్యలకోసం తరచూ వెళ్ళే క్లినిక్కులు, ఇతర వైద్యశాలలూ ఇప్పుడు అందుబాటులో ఉండవు. ఒకవేళ ఎక్కడో ఒక చోట అవి ఉన్నాయనుకున్నా- రవాణా సదుపాయాలు కొరవడిన ప్రస్తుత తరుణంలో ఎవరి సహకారమూ లేకుండా అంతంత దూరం ప్రయాణించడం కుదిరే పనికాదు. దేశంలో 15 కోట్ల సంఖ్యలో దివ్యాంగులు ఉన్నట్లు అంచనా. వారిలో 2.5 కోట్లనుంచి మూడు కోట్లమంది తీవ్రమైన వైకల్యంతో ఇబ్బందులు అనుభవిస్తున్నారు. వీరిలో అత్యధికశాతం సహాయకుల తోడ్పాటుతోనే జీవనం నెట్టుకొస్తున్నారు. ఆ రకంగా మరో 2.5 కోట్లనుంచి మూడు కోట్ల సహాయకులు వీరికి జతపడుతున్నారు. ఈ లెక్కన సుమారు అయిదు కోట్లమందికి ప్రత్యేక మద్దతు అందించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగులకు తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం నిబద్ధతతో ప్రయత్నించాలి. ఆరోగ్య వ్యవస్థలను ఆ మేరకు ఆధునికంగా తీర్చుదిద్దుకోవాలి. వైద్యశాలల్లో దివ్యాంగులకు నిరీక్షణ సమయం తగ్గించడంతోపాటు, ఔషధాలనూ సాధ్యమైనంత త్వరగా వారికి అందించే ఏర్పాట్లు చేయాలి. సంచార ఆరోగ్య బృందాల సాయంతో ఇళ్లవద్దకే వెళ్ళి వైద్య సేవలు సమకూర్చాలి. దివ్యాంగులకోసం ప్రత్యేక ‘హెల్ప్‌లైన్’ ఏర్పాటు చేయాలి. తద్వారా ఏ క్షణం ఏ అవసరమొచ్చినా వైద్య సిబ్బంది తక్షణమే వారిని చేరుకుని సాయం అందించేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. సబ్బులు, శానిటైజర్లు, టిష్యూ పేపర్లను వీరికి విరివిగా అందించాలి. ప్రస్తుత సంక్షోభ వాతావరణంలో రాజకీయ నాయకత్వం దార్శనిక దృక్పథంతో వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాలను, వృద్ధులను, దివ్యాంగులను కలుపుకొని వెళ్లగల సమ్మిళిత సంక్షేమ విధానాలకు ప్రభుత్వాలు తెరచాపలెత్తాలి.
-ప్రొఫెసర్ జీవీఎస్ మూర్తి
(రచయిత- హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ డైరెక్టర్)