భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయి. గతంలో కొందరు వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వగా కొందరికి అస్వస్థత లక్షణాలు కనిపించాయి. దీంతో దేశంలో వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతులు వచ్చాక తిరిగి ప్రయోగాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. పుణెలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి, ససాన్ జనరల్ ఆస్పత్రిలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ప్రయోగాలను చేపడుతోంది.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొంతమంది వాలంటీర్లకు రెండో డోసును ఇచ్చారు. వారిలో కొంత మందికి కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, అవి సాధారణమేనని సీనియర్ వైద్యుడొకరు చెప్పారు. మరి కొంతమందిలో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత జ్వరం వచ్చిందని అయితే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గతంలో క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అస్వస్థతకు గురికావడం వల్ల తామే స్వచ్ఛందంగా ప్రయోగాలను నిలిపివేశామని, పూర్తి స్థాయి వివరాలు వచ్చి, అంతా సక్రమంగా ఉందని నిర్ధరించుకున్న తర్వాతనే తిరిగి ప్రయోగాలు ప్రారంభించామని ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధి మిచిలే మియాక్సెల్ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ఆస్ట్రాజెనెకాతో భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది.