పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య భారతంలో రగడ కొనసాగుతోంది. అసోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. సుమారు పదివేల మంది నిరసనకారులు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలోని గువహటిలో ఆందోళనలు చేపట్టారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వివాదాస్పద బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాజధాని దిస్పుర్లో ఓ బస్సుకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
ఏ రాజకీయ పార్టీ, విద్యార్థి సంస్థ బంద్‌కు పిలుపునివ్వనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగించారు. అసోం సచివాలయానికి వెళ్లే రహదారిని నిర్బంధించారు. గువహటి, దిబ్రూగఢ్, జోర్హాట్లలోని వందలమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగులు, బానర్లను చించేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
విమానాశ్రయంలో సోనోవాల్ ఘోరావ్
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్కూ నిరసన సెగ తగిలింది. గువహటి గోపినాథ్ బార్డోలోయి విమానాశ్రయంలో ఆందోళనకారులు అడ్డుకున్నారు.
దిబ్రూగఢ్‌లో..
దిబ్రూగఢ్‌లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ తూటాలను కాల్చారు పోలీసులు. శాంతి భద్రతల నియంత్రణ కోసం మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జిల్లా అధికార యంత్రాంగం.
జోర్హాట్, గోలాఘాట్, తిన్సుకియా, శివసాగర్, బోన్గాయి గావ్, నాగావ్లలో మెరుపు ఆందోళనకు దిగారు ప్రజలు. దిస్పుర్లో బస్సును తగలబెట్టారు.
50 కంపెనీల బలగాలు..
ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు కశ్మీర్‌కు తరలించిన పారామిలిటరీ దళాలను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 5వేలమంది పారా మిలిటరీ సిబ్బంది ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం 20 కంపెనీ దళాలను కశ్మీర్ నుంచి ఉపసంహరించారు. ఇతర ప్రాంతాల నుంచి మరో 30 కంపెనీలను తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి