దేవుడికి మృతదేహాన్ని అర్పిస్తే తిరిగి జీవం పోసుకుంటారనే విశ్వాసంతో ఐదేళ్ల బాలిక భౌతికకాయాన్ని బ్రహ్మపుత్ర నదిలో పడవలో వదిలేశారు గ్రామస్థులు. వినడానికే వింతగా ఉన్న సంఘటన పశ్చిమ అస్సాంలోని ధుబ్రి జిల్లా బిలాసిపప్రా గ్రామంలో జరిగింది. ఇలా చేస్తే దేవుడు చనిపోయిన వారికి పునరుజ్జీవం ప్రసాదిస్తాడని శివపురాణాల్లోని ఓ కథలో ఉన్నట్లు ఇక్కడి గ్రామస్థులు విశ్వసిస్తారు.
ఐదేళ్ల చిన్నారి పూజా నాథ్‌ను గత శుక్రవారం విషసర్పం కాటేసింది. బాలికను ఆసుపత్రికి తరలించకుండా స్థానిక మాంత్రికులతో చికిత్స అందించారు కుటుంబసభ్యులు. పరిస్థితి విషమించాక ఆదివారం రోజు బొంగైగావ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
బాలిక మృతిని తట్టుకోలేని కుటుంబ సభ్యులు చివరకు దేవుడిపై భారం మోపి మృతదేహాన్ని నదిలో వదిలేశారు. గ్రామస్థులు చూస్తుండగానే భౌతికకాయం నదిలో కొట్టుకుపోయింది.