అసోంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 14 మంది మరణించారు.
"సుమారు 1.89 లక్షల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. సుమారు 19,430 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది."
- అసోం విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ)
సహాయక చర్యలు
వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్... అధికారులను ఆదేశించారు. అయితే కరోనా నియంత్రణ ప్రోటోకాల్‌ను అనుసరించాలని స్పష్టం చేశారు.
దీహాజీ, జోర్హాట్, మజులి, శివసాగర్, దిబ్రుగఢ్ జిల్లాల్లో వరదల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఒక్క దీహాజీ జిల్లాలోనే 91 వేల మంది వరదల ప్రభావానికి గురయ్యారు. మరోవైపు కొత్తగా లఖింపుర్, బిశ్వనాథ్, గోలఘాట్, టిన్సుకియా జిల్లాల్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనితో మొత్తం వరద బాధితుల సంఖ్య 1.89 లక్షలకు పెరిగిపోయింది.
పునరావాస కేంద్రాలు
వరదల తాకిడికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు బాధితుల కోసం 49 పునరావాస కేంద్రాలు, సహాయక శిబిరాలు ఏర్పాటుచేశారు. సుమారు 11,468 మందికి అక్కడ ఆశ్రయం కల్పించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
ఇదీ చూడండి: భారత్-నేపాల్ మధ్య 'వాచ్ టవర్' వివాదం