ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని బరాక్ లోయ 104 గిరిజన గ్రామాలకు ఆవాసం. ఇండియా- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతం టీ, చెరకు తోటలూ, వరి పొలాలతో భూమికి పచ్చని రంగేసినట్టు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి నెలవైన ఆ లోయలో ఆడా మగా అన్న తేడా లేకుండా పొగతాగడం, మద్యం సేవించడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా.. అక్కడ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్యా ఎక్కువే. కానీ ఆ గిరిజనులు వైద్యం చేయించుకోవాలంటే 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గువాహటికి వెళ్లాల్సిందే. అంత దూరం వెళ్లలేక క్యాన్సర్‌తో ప్రాణాలు వదిలినవాళ్లెందరో...
అడయార్‌లో ఉద్యోగం మానేసి
అప్పటికి చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నాడు రవి కన్నన్. ఒకసారి గెస్ట్ సర్జన్‌గా అసోం వెళ్లినప్పుడు క్యాన్సర్ బారినపడిన ఓ వ్యక్తి వైద్యానికి డబ్బుల్లేక ఐదువేల రూపాయలకి మూడేళ్ల కొడుకుని అమ్ముకోవడం కళ్లారా చూశాడు. అతని నేపథ్యం, పరిస్థితి గురించి తెలుసుకున్న రవి బరాక్ లోయకి వెళ్లాడు. అక్కడ క్యాన్సర్ బారిన పడిన వాళ్ల దుస్థితిని చూసి తన సేవలు వాళ్లకెంతో అవసరమని భావించాడు. అప్పటికే అక్కడ కొందరు ఓ ట్రస్టుగా ఏర్పడి నాలుగ్గదులతో ఓ ఆసుపత్రిని కట్టారు. కానీ నిధులూ, సౌకర్యాలూ లేక అది ఎవరికీ ఉపయోగపడకుండా ఉంది. దాన్నే క్యాన్సర్ ఆసుపత్రిగా మార్చేద్దామని భావించిన రవి.. అడయార్‌లో ఉద్యోగం మానేసి అసోం బాట పట్టాడు.
ఇంటింటికీ వెళ్లి
2007లో కచార్ క్యాన్సర్ హాస్పిటల్‌లో అడుగుపెట్టిన రవి కేవలం పదేళ్లలో దాని రూపురేఖలు మార్చేశాడు. 350 మంది సిబ్బందీ, వంద పడకలూ, ఆధునిక సదుపాయాలతో పెద్దాసుపత్రిగా తీర్చిదిద్దాడు. దాని వెనక రవి కృషి అంతా ఇంతా కాదు. ఓవైపు సౌకర్యాలూ, సిబ్బంది, నిధుల కొరత.. మరోవైపు వైద్యం ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల జనాలు వచ్చేవారు కాదు. ఈ క్రమంలో రవి ఒక్కో సమస్యనీ దాటుకుంటూ ప్రతి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాడు. స్కూళ్లలో హెడ్ మాస్టర్లతో మాట్లాడి తల్లిదండ్రులు క్యాన్సర్ స్క్రీనింగ్ రిపోర్టులు చూపితేనే పిల్లల్ని స్కూల్లో చేర్చుకోవాల్సిందిగా కోరాడు. కనీసం అలాగైనా స్క్రీనింగ్ చేయించుకుంటారని రవి ఆశ.
నామమాత్రపు ఫీజుతో జీవితకాల వైద్యం
అలా క్రమంగా పరీక్షలు చేయించుకోవడానికి రోగులు రావడం మొదలైంది. మొదట్లో అక్కడ నామమాత్రపు ఫీజులు తీసుకునేవారు. అయినా సరే రోగులు ఫాలోఅప్ కోసం వెళ్లేవారు కాదు. అవన్నీ గమనించి ఉచితంగా వైద్య సేవలు అందించాలనుకున్నాడు రవి. ఎందుకంటే క్యాన్సర్ రెండు మూడుసార్లు ఆసుపత్రికి వెళితే నయమయ్యే జబ్బు కాదు. దాదాపు ఏడాదికిపైనే వైద్యం చేయించుకోవాలి. మరి పేదల్ని తరచూ హాస్పిటల్‌కి రప్పించాలంటే వాళ్లకి ఆర్థిక భారం లేకుండా చూడాలి. అందుకే రూ.500 ఫీజు కట్టించుకుని వారికి జీవిత కాలం ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టాడు. స్తోమత లేనివారి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్నాడు. అలానే పనులు వదులుకుని రోగులకు తోడుగా వచ్చే సహాయకులకు ఆ రోజు ఏదో ఒక పని ఇచ్చి వారికి సుమారు రూ.300 కూలీ ఇచ్చేవాడు. హాస్పిటల్‌లో ఉన్నన్నాళ్లూ, రోగులకు భోజనం కూడా పెడుతున్నాడు.
అత్యాధునిక ల్యాబ్
అలానే క్యాన్సర్ పరీక్షలకి సమయం పడుతుంది. బయాప్సీ రిపోర్టులు రెండు మూడు రోజులకిగానూ రావు. రోగులకు అన్ని రోజులు ఆసుపత్రిలో ఉండటమంటే కష్టమే. అందుకే వాళ్ల సౌకర్యార్థం ఒక్కరోజులోనే రిపోర్ట్సు వచ్చేలా అత్యాధునిక ల్యాబ్‌ను ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సాయంతో ఏర్పాటు చేశాడు. క్యాన్సర్‌తో బాధపడే పిల్లలకు పెయింటింగులూ, క్రాఫ్ట్స్ నేర్పించడంతోపాటు ఆటలు ఆడిస్తూ వాళ్లలో ఉత్సాహం నింపుతుంటాడు. పాలియేటివ్ కేర్ యూనిట్‌ని కూడా పెట్టి చివరి రోజుల్లో బతుకీడ్చే పేదలకు ఆనందాన్ని పంచుతున్నాడు.
కేంద్ర ప్రభుత్వం - పద్మశ్రీ
కేవలం పదేళ్లలో అక్కడ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య తగ్గి, దాన్నుంచి బయటపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకుగానూ కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న ఈ వైద్య నారాయణుడికి రెండు చేతులెత్తి నమస్కరించాలనిపించడం లేదూ..!
ఇదీ చదవండి: 'ఈ చిట్కాలతో ఒంటరితనాన్ని అలా తరిమికొట్టేయొచ్చు!'