కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత షాతో కేజ్రీవాల్ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. షా నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురూ చర్చలు జరిపారు.
దిల్లీ అభివృద్ధికి కోసం కలిసి పనిచేయాలని అమిత్ షాను కోరారు కేజ్రీవాల్. అనంతరం భేటీ వివరాల్ని ట్విట్టర్లో వెల్లడించారు.
'గౌరవనీయులైన హోం మంత్రి అమిత్ షాను కలిశాను. సమావేశం ఫలప్రదంగా సాగింది. దిల్లీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాం. దిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఒక అంగీకారానికి వచ్చాం.''
- కేజ్రీవాల్ ట్వీట్
ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఆప్ హోరా హోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 స్థానాల్లో జయభేరి మోగించింది. 8 స్థానాలను గెలుచుకుంది భాజపా. ఈ నెల 16న మూడోసారి హస్తిన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్.. దిల్లీ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. తమకు నరేంద్ర మోదీ ఆశీస్సులు కావాలని ప్రసంగించారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: యుద్ధ మేఘాల నుంచి స్నేహగీతాల వరకు...