అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఆయన ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని ట్విటర్ వేదికగా తెలిపారు.
'నేను ఆర్టీ పీసీఆర్ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాను. అందులో నాకు పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం నాకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఇతరుల భద్రత నిమిత్తం ఐసోలేషన్‌లో ఉంటున్నాను. అంతేకాకుండా ఇటీవల నాతో సంప్రదింపులు జరిపిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా' అని ఆయన ట్వీట్‌లో వెల్లడించారు.
కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 1,054 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 49లక్షలకు చేరింది. అయితే మరణిస్తున్న కొవిడ్ రోగుల్లో 70శాతం ఇతర వ్యాధులు ఉన్నవారేనని ఆరోగ్య శాఖ తెలిపింది.