జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 300 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద కాపుగాసి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక్కడి నుంచి కశ్మీర్ లోయలోకి చొరబడాలన్నది వారి కుట్రగా తెలుస్తోంది. రంజాన్ వేళ భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
వీరంతా.. నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రముఠాలు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం పరిస్థితుల్ని నిరంతరం సమీక్షిస్తోంది.
అప్రమత్తం..
కశ్మీర్‌లోని XV-కార్ప్స్కు నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు.. చొరబాట్లకు అవకాశమున్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదలకుండా తనిఖీ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. తరచుగా వివిధ బృందాలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఒకవేళ ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులు, బలగాల మధ్య కాల్పులు జరిగితే ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై కొన్ని సూచనలు చేశారు అధికారులు. ప్రత్యర్థులకు కరోనా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో.. అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు.
అదే బుద్ధి..
కరోనా కాలంలోనూ పాక్ కుయుక్తులు కొనసాగిస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబడేందుకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో.. దాదాపు 16 ఉగ్రవాద శిబిరాలను ఇటీవలి కాలంలో పాక్ సైన్యం తిరిగి పునరుద్ధరించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ లాంచింగ్ ప్యాడ్లు.. కొండప్రాంతాలైన నౌషెరా, ఛాంబ్ ప్రాంతాల్లోనే ఉన్నట్లు సమాచారం.
ఉరీ ఘటనకు అదే కారణం...
2016 సెప్టెంబర్ 18న నలుగురు ఉగ్రవాదులు.. భారత భూభాగంలోకి చొరబడి 19 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఆ ముష్కరులూ తర్వాత హతమయ్యారు. ఈ ఘటన.. ఉరీ మెరుపు దాడులకు దారితీసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం దాడులు చేసింది.
పాకిస్థాన్ ఇటీవల కొత్త పంథాలో ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలున్నాయని ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అందుకు తాలిబన్ల సహకారం ఉండడం మరింత ఆందోళనకర విషయమని విశ్లేషిస్తున్నారు. కశ్మీర్లో ఏదో జరగబోతోందనేలా ఇప్పటికే వెలువడుతున్న సంకేతాలు అధికార యంత్రాంగానికి గుబులు పుట్టిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కశ్మీర్‌పై పాక్ కొత్త కుట్రలు- తాలిబన్ల సాయంతో...