భారతదేశం ఖడ్గ విద్యలు.. యుద్ధ విన్యాసాలు చేసే యోధులకు నెలవు. అయితే, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అలాంటి వారు కనిపించటం చాలా అరుదు. కేరళకు చెందిన 22 ఏళ్ల అరోమల్ రామచంద్రన్.. ఖడ్గ విద్యలో అద్భుత ప్రదర్శ చేస్తున్నాడు. అరుదైన 'ఉరిమి' ఖడ్గ విద్యను అవలీలగా 5 గంటలకుపైగా ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఐదు గంటలకుపైగా..
కేరళ కన్నూరుకు చెందిన అరోమల్.. గతేడాది నవంబర్11న చేసిన ఖడ్గ ప్రదర్శనకు.. 'హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం దక్కింది. అత్యంత పదునైన 'ఉరిమి' ఖడ్గాన్ని చేత్తో తిప్పుతూ.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 నిమిషాల వరకు ప్రదర్శన చేశాడు అరోమల్. 5 గంటల 4 నిమిషాలు ఆగకుండా ప్రదర్శించాలంటే ఎంతో నేర్పు అవసరం.
అరోమల్కు ప్రంపంచ రికార్డు ఊరికే వచ్చిపడలేదు. తన విజయం వెనుక మూడేళ్ల శ్రమ దాగి ఉంది. కడతనాడ్ కేపీసీజీఎమ్ కెలరీ సంఘంలో మూడేళ్లు కఠోర సాధన చేసి ప్రావీణ్యం సాధించాడు.
చిన్న నాటి నుంచే..
అరోమల్కు బాల్యం నుంచే కలరీపయట్టు(యుద్ధ కళ) అంటే మహా ఇష్టం. రెండేళ్ల వయసులోనే తండ్రి రామచంద్రన్ గురుక్కల్(శిక్షణా కేంద్రం)లో సాధన ప్రారంభించాడు. తల్లి శైలజ కేరళలోనే తొలి మహిళా కలరీ గురుక్కల్ను స్థాపించి నారీ శక్తికి మరింత ప్రోత్సాహాన్నిస్తోంది.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో..
ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి కలరీ పోటీల్లో విజయకేతనం ఎగురవేసి యుద్ధ కళలపై తనకున్న మక్కువను చాటుకున్నాడు అరోమల్. డిగ్రీ చదువుతున్నప్పుడు కలరీ యునివర్సిటీ ప్రథమ స్థానం దక్కించుకుని సత్తా చాటాడు. దిల్లీ, పంజాబ్లలో.. మూడు వందలకు పైగా ఫుట్బాల్ ఆటగాళ్లకూ శిక్షణ ఇచ్చాడు.
అందుకే.. తానెంతో ఇష్టపడే అరుదైన యుద్ధ కళను అంతరించిపోనీయకుండా తనవంతు కృషి చేస్తున్నాడు అరోమల్.. అలెప్పీలో సొంతంగా ఓ గురుక్కల్ను స్థాపించి 150కి పైగా విద్యార్థులకు కలరీపయట్టు పాఠాలు నేర్పుతున్నాడు.
ఇదీ చదవండి:పోలీసులను పరుగెత్తించి కొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా?