ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం.. కశ్మీర్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రమాదకర యుద్ధభూమి సియాచిన్ గ్లేషియర్ సహా ఇతర ఎత్తైన మిలిటరీ స్థావరాలను భారతీయులకు అందుబాటులో ఉంచడానికి సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. సీనియర్ అధికారులతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని సైన్యాధిపతి బిపిన్ రావత్ ప్రతిపాదించారు.
ఇప్పటికే సైనిక శిక్షణ కేంద్రాలు, సైనిక స్థావరాలకు పర్యటకులను అనుమతిస్తోంది సైన్యం. ఇప్పుడు సియాచిన్ వంటి ఫార్వడ్ పోస్ట్‌లకూ ప్రజలను అనుమతిస్తే అది జాతీయ సమగ్రతకు తోడ్పడుతుందని బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు.
జమ్ము విభజన అనంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన లద్దాఖ్‌లోని భాగం ఈ సియాచిన్. అయితే పర్యటకులను అనుమతిచ్చే ప్రదేశాలు, అనుసరించాల్సిన పద్ధతులపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు.
మన సైన్యం పాక్‌తో యుద్ధం చేసిన కార్గిల్, టైగర్ హిల్ వంటి ప్రాంతాలను సందర్శించేందుకు లద్దాఖ్‌లో పర్యటించే భారతీయులు పదేపదే అడుగుతున్నారని సమాచారం.
2007 అనంతరం సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి ఎత్తైన సియాచిన్ గ్లేషియర్‌కు ట్రెక్కింగ్ చేసేందుకు భారత్ అనుమతిస్తోంది.
సియాచిన్‌లో చెత్త తొలగింపు...
సియాచిన్‌పై పేరుకుపోయిన 130 టన్నుల వ్యర్థాలను సైన్యం తొలగించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర యుద్ధభూమికి సంబంధించిన పర్యావరణ వ్యవస్థ రక్షణలో భాగంగా సైన్యం ఈ చర్యలు చేపట్టింది.
అధికార గణాంకాల ప్రకారం గ్లేషియర్‌లో ఉన్న పూర్తి వ్యర్థాలు 236 టన్నులు. ఏడాదిన్నరగా వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టింది సైన్యం.
ఇదీ చూడండి:- భూమిని ఆకాశం ముద్దాడిన దృశ్యం చూశారా?