కాాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ తీరుపై మండిపడ్డారు మాజీ సైనికాధికారులు. భారత్- చైనా మధ్య తూర్పు లద్దాఖ్ సరిహుద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రాన్ని విమర్శిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అలాంటి విమర్శలు చేయడం విచారకరమన్నారు.
పాకిస్థాన్ విషయంలో రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రభుత్వం, సైన్యం అనుకూలంగా మల్చుకుందని లేఖలో పేర్కొన్నారు మాజీ సైనికాధికారులు. మాజీ వైస్ మార్షల్ సంజిబ్ బార్దోలాయ్, మాజీ ఎయిర్ కమాండర్ పీసీ గ్రోవర్, మాజీ బ్రిగ్ దినకర్ అదీప్ లేఖ ద్వారా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు.
సైనిక విషయాలను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలతో ముడిపెట్టొద్దని హితవు పలికారు మాజీ సైనికాధికారులు. అలాంటి వ్యాఖ్యలు సైన్యం ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. ప్రపంచంలోనే భారత సైన్యం అత్యుత్తమమని కొనియాడారు.
1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు భారత్ ఓడిపోయిందని.. అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారని గుర్తు చేశారు విశ్రాంత సైనికాధికారులు. అప్పుడు ఎలాంటి సన్నద్ధత లేకుండానే యుద్ధంలోకి దిగామని చెప్పారు. యుద్ధంలో ఓడిపోయినప్పటికీ చైనాకు భారీ ప్రాణ నష్టం మిగిల్చామన్నారు.
చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోదీ నిశ్శబ్దంగా ఉన్నారంటూ రాహుల్ గాంధీ ఇటీవలే విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది.