చేతిలో విల్లు, బాణం.. గురి అంతా లక్ష్యంపై.. రాజస్థాన్ దుంగార్పూర్ జిల్లాలోని బిలాడీ అనే తండా ఆర్చర్లకు పెట్టింది పేరు. ఓ అంతర్జాతీయ స్థాయి విలుకాడితో పాటు... ఈ తండాలో 30 మంది జాతీయ, 30 మందికిపైగా రాష్ట్రస్థాయి విలువిద్య క్రీడాకారులున్నారు. అబ్బాయిలకు తీసిపోని విధంగా అమ్మాయిలూ రాణిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ములంతా కలసి విలువిద్య సాధన చేస్తారు.
మనీషా ననోమాతో పాటు.. సోదరులు వినోద్, పంకజ్ జాతీయ స్థాయి ఆర్చర్లే. కాంతా కటారా 1997లో జాతీయస్థాయిలో స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ ననోమా 4 స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. మనీషా ననోమా జాతీయస్థాయిలో 4, రాష్ట్ర స్థాయిలో 4 స్వర్ణ పతకాలు సాధించింది. ఇంకా ఎంతోమంది ఆటగాళ్లు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు గెలుచుకున్నారు.
2013లో ఉదయ్పుర్లో 9వ తరగతి చదివే సమయంలో జయపురలోని అకాడమీకి ఎంపికయ్యా. తేజిందర్ జీ గురించి, సర్ని అడిగాను. అప్పటి నుంచి విలువిద్య సాధన మొదలు పెట్టా. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 3సార్లు స్వర్ణపతకం గెలిచా. తర్వాత జాతీయ స్థాయిలో ఆడా. 2013 తర్వాత క్రమం తప్పకుండా 9, 10 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. నా క్రీడా ప్రతిభ వల్ల మంచి ఉద్యోగం కూడా వచ్చింది.
- మనీషా ననోమా, ఆర్చర్
ఉద్యోగాలూ..
కుదిరితే.. తండాకు 5 కిలోమీటర్ల దూరంలోని క్రీడాప్రాంగణానికి వెళ్తారు వీరంతా. లేదంటే ఊర్లోనే ఖాళీస్థలంలో సాధన చేస్తారు. భారత విలువిద్య మాజీ కోచ్ జయంతి లాల్ ననోమా వద్ద వీళ్లంతా శిక్షణ తీసుకున్నారు. జయంతీ లాల్ 1995లో ఆర్చెరీలోకి ప్రవేశించారు. 2006లో దేశానికి మొదటి పతకం సాధించారు. తర్వాత ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత విలువిద్య జట్టుకు కోచ్‌గా, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా విలువైన సేవలు అందించారు జయంతీలాల్.
25 నుంచి 30 మంది స్థానిక యువతీయువకులు జాతీయ స్థాయిలో ఆర్చెరీ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఆట నేపథ్యంలోనే ఏడుగురికి కోరుకున్న ఉద్యోగాలు వచ్చాయి.
- జయంతీలాల్ ననోమా, అంతర్జాతీయ స్థాయి ఆర్చర్
డబ్బు కూడబెట్టి.. అప్పు చేసి..
కొందరు కష్టపడి సంపాదించిన డబ్బుతో విల్లు కొంటే... మరికొందరు ఉపకార వేతనంతో కొనుక్కుంటారు. జయంతీలాల్ 2006 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అప్పు చేసి కొన్న విల్లుతో పాల్గొన్నారు. 4 ఆసియన్ గ్రాండ్పిక్స్ పోటీల్లో పాల్గొన్న ఆయన.. 40 పతకాలకు పైగా ఖాతాలో వేసుకున్నారు. ఆర్చెరీ అంటే తనకున్న ఆసక్తితో.. ఓ అకాడమీ సౌకర్యం కల్పిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చనిని జయంతీలాల్ అనేవారు.
బికనేర్, ఢోల్పూర్లో 2019లో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు గెలుచుకున్నా. జాతీయ స్థాయిలోనూ ఆడా. జూనియర్ ఓపెన్లో పాల్గొని, కాంస్యం గెలుచుకున్నా.
- టీనా ననోమా, ఆర్చర్
పాఠశాలలో ఉన్నప్పుడు చెక్క విల్లు, బాణంతోనే ఆడా. నాకు విలువిద్య అంటే చాలా ఇష్టం. అందుకే ప్రభుత్వం నుంచి మంచి కిట్లు ఇప్పించమని సర్ను అడిగా. అయినా ఇప్పటివరకూ ఏమీ జరగలేదు. భవిష్యత్తులోనైనా కష్టపడి, బాగా ఆడి, ఆర్చరీ కిట్లు సంపాదించుకుంటాం.
- రేణుకా అహారీ, ఆర్చర్
ఈ ఆదివాసీలకు ఓ అకాడమీ అవసరం ఉంది. ఇప్పటికైతే కొన్ని అందుబాటులో ఉన్నా... టాటా లాంటి ప్రైవేటు అకాడమీలు దగ్గర్లో ఉంటే వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది. ఉన్నత స్థాయికి వాళ్లు ఎదిగే అవకాశం లభిస్తుంది.
- జయంతీలాల్ ననోమా, అంతర్జాతీయ స్థాయి ఆర్చర్
గెలిచిన ప్రతిసారీ ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో సాధన చేస్తారు.
ఇదీ చూడండి: పనికిరాని వస్తువులతో 'వావ్' అనిపించే కళాకృతులు