తమిళనాడు థేని జిల్లాలోని అన్డిపట్టులో దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం కోటి 48లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
రేపే ఉప ఎన్నిక
అన్డిపట్టు అసెంబ్లీకి గురువారం ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు డబ్బు పంచేందుకు నగదు నిల్వ చేశారనే అనుమానంతో విస్తృత తనిఖీలు చేశారు అధికారులు .
"లెక్కలు చూపని రూ.కోటి 48లక్షల నగదును సీజ్ చేశాం. మొత్తం డబ్బు 94 ప్యాకెట్లలో కట్టిపెట్టారు. వాటిపై వార్డు సంఖ్యలు ఉన్నాయి. ఒక్కో ఓటుకు రూ.300 ఇవ్వాలని ఆ ప్యాకెట్లపై రాసి ఉంది. ఆ వార్డులన్నీ అన్డిపట్టు అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి."
-- ఐటీ శాఖ అధికారి బి.మురళి కుమార్
పార్టీ కార్యాలయ పరిసరాల్లోనే
అన్డిపట్టులో అధికారులు సోదాలు నిర్వహించిన భవనం కింది అంతస్తులోనే ఏఎంఎంకే పార్టీ కార్యాలయం ఉంది.
సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఏఎంఎంకే కార్యకర్తలు. ఫలితంగా ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఏఎంఎంకే కార్యకర్తలు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ తనిఖీలు, సీజ్ చేసిన మొత్తంపై సమగ్ర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని ఓ సీనియర్ అధికారి చెప్పారు.