పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో అట్టుడుకుతున్న అసోం, బంగాల్లో బుధవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. అసోం రాజధాని గువాహటి, మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉదయం 6 గంటల నుంచి 14 గంటల పాటు కర్య్ఫూను సడలించారు. దీంతో వ్యాపార సముదాయాలు, బ్యాంకులు తిరిగి తెరుచుకున్నాయి. విద్యాసంస్థలు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునఃరుద్ధరించలేదు.
దీదీ ర్యాలీ
పౌరసత్వ చట్ట సవరణ, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలును వ్యతిరేకిస్తూ వరుసగా మూడో రోజు కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. హావ్డా మైదానం నుంచి ఎస్ప్లెనేడ్ వరకు వేలాది మందితో కలిసి పాదయాత్ర చేశారు.
పౌరసత్వ చట్ట సవరణతో దేశంలో చిచ్చు రేగిందని, దానిని ఆర్పాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్షాదేనని అన్నారు మమత.