పౌర అల్లర్ల నేపథ్యంలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సమానమైన పరిహారాన్ని చెల్లించాలంటూ ఇటీవలే ఉత్తరప్రదేశ్ జిల్లా యంత్రాంగం నిరసనకారులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ నోటీసులను తక్షణమే రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
నిరసనల పేరుతో.. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ, ఆరేళ్ల క్రితం మరణించిన వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు న్యాయవాది పర్వైజ్ ఆరిఫ్. ఎలాంటి ఎఫ్ఐఆర్ దాఖలు కాని.. నేర చరిత్రలు లేని వారికీ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.
2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారని... కానీ ఈ తీర్పు 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గనిర్దేశకాలను ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు పర్వైజ్.
హైకోర్టుల్లో నిందితులుగా ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారాన్ని వసూలు చేయాలని 2009లో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే.. ఈ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్నానికి అప్పగిస్తూ.. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు పిటిషనర్ తరఫు న్యాయవాది.
ఇలాంటి చర్యలతో తమ రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీలను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకునే అవకాశముందని వ్యాజ్యంలో పేర్కొన్నారు పర్వైజ్. అందువల్ల నోటీసులను రద్దు చేసే విధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఇదీ చూడండి:- నితిన్ గడ్కరీ బౌలింగ్లో.. హార్దిక్ పాండ్య సిక్సర్