ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ ఘటన తర్వాత బాలికల అపహరణ, సామూహిక అత్యాచారాల కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హాథ్రస్ బాధితురాలికి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించిన కొన్ని గంటల్లోనే.. అలాంటి ఘటనే బలరాంపుర్‌లో బయటపడింది. 22 ఏళ్ల ఓ యువతిని అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
కళాశాలలో అడ్మిషన్ కోసం వెళ్లిన తన కూతురిని కొందరు దుండగులు అపహరించారని.. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
" అడ్మిషన్ కోసం మా కూతురు కళాశాలకు వెళ్లింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో దీన పరిస్థితుల్లో ఇంటికి తిరిగివచ్చింది. కనీసం మాట కూడ రావట్లేదు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆసుపత్రికి తరలించాం. మా కూతురుని ముగ్గురి నుంచి నలుగురు వ్యక్తులు అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెను అపస్మారక స్థితికి పంపి.. సామూహిక అత్యాచారం చేశారు. ఆమె కాళ్లు, నడుము విరిగిపోయాయి. అత్యచారం, శారీరక హింస తర్వాత వారే ఈ-రిక్షాలో ఇంటివద్ద వదిలి వెళ్లారు. తాను బతకాలని కోరుకుంది, కానీ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచింది."
- బాధితురాలి తల్లి.
ప్రాథమిక సమాచారం మేరకు సదరు యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. అయితే.. పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది.
మరో ఘటన..
అయోధ్యలో దిగ్ర్భాంతికర ఘటన చోటు చేసుకుంది. అయోధ్య బికపుర్ ప్రాంతంలో ఓ 10వ తరగతి బాలికపై.. ఇంటి పక్కన ఉంటే ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 26న పొరుగింటి వ్యక్తి బాలికను పిలిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి బాలికను అపహరించి.. లఖ్‌నవూకు తీసుకెళ్లారని, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుల్తాన్‌పుర్‌లో వదిలి వెళ్లగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు బాధితురాలి కుటుంబసభ్యులు.
ఇదీ చూడండి: బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!