నిర్భయ కేసులో ఉరి శిక్ష తప్పించుకునేందుకు తమకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నారు దోషులు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్‌శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను ఇవాళ ఉదయం... రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మరో దోషి అక్షయ్ కుమార్.. క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే సమయంలో.. దోషులను ఉరి తీసేందుకు నూతన తేదీ ఖరారు చేయాలని దిల్లీ పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు తిహార్ జైలు అధికారులు.
"దోషిగా తేలిన వినయ్‌శర్మ రాష్ట్రపతి వద్ద దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఉరి తీసేందుకు నూతన తేదీ ఖరారు చేయాలని దిల్లీకోర్టును ఆశ్రయించాం."
-సందీప్ గోయల్, తిహార్ జైలు డీజీ
మరోమారు వాయిదా..
నిర్భయ కేసు దోషులను ఈ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే... డెత్‌వారెంట్లపై దిల్లీ కోర్టు శుక్రవారం సాయంత్రం స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ నిలుపుదల అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: సీతమ్మ రికార్డు: ఏకధాటిగా 160 నిమిషాల ప్రసంగం