గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయగా.. మరో ఎమ్మెల్యే అదే బాటలో నడిచారు. మూడు రోజుల్లో ఇది మూడో రాజీనామా. మోర్బీ నియోజకవర్గం నుంచి గెలిచిన బ్రిజేశ్ మెజ్రా శాసనసభ సభ్యత్వంతో సహా.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. బ్రిజేశ్ రాజీనామాను స్పీకర్ రాజేంద్ర త్రివేది ఆమోదించినట్లు అసెంబ్లీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు 8 మంది..
ఈ ఏడాది మార్చిలో ఒకేసారి ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా చేయగా.. గత బుధవారం ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జీతూ చౌధరీలు అదే బాటపట్టారు. ఈ నెల 19న గుజరాత్‌లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఇలా రాజీనామాల పరంపర కొనసాగుతుండటం ప్రాధాన్యం సంతరించకుంది. ఈ 4 స్థానాలకు కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్ధులను బరిలో దింపగా.. భాజపా ముగ్గురిని పోటీలో నిలిపింది.
తగ్గిన కాంగ్రెస్ బలం..
రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు భాజపా తరపున 103 మంది, కాంగ్రెస్ తరపున 68 మంది గెలిచారు. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు, ఎన్‌సీపీ, స్వతంత్రులు చెరో స్థానంలో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 60 కి చేరింది.
ఇదీ చదవండి: 'భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది'