చైనాలోని వుహాన్‌కు నేడు మరో విమానం బయల్దేరింది. కరోనా బాధిత దేశమైన చైనాలోని మిగిలిన భారతీయులను స్వదేశానికి తెచ్చే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా విమానం చైనాకు రెండో దఫా వెళ్లింది. ఈ విమానంలో రామ్మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యుల బృందం సహా పారామెడికల్ సిబ్బంది, విమాన ఇంజినీర్లు ఉన్నారు.
"కరోనా బాధిత ప్రాంతమైన చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మరో విమానం చైనాకు బయల్దేరింది. ఇందులో తొలి దఫాలో వెళ్లిన వైద్య బృందం, మరో విమాన సిబ్బంది బృందం ఉంది. రెండో దఫా వెళ్లిన విమానానికీ కెప్టెన్ అమితాబ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు."
-ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి
వుహాన్‌లో సుమారు 6వందలమంది భారతీయులు ఉండగా వీరిలో 342మందిని తొలివిడతలో ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చారు. దిల్లీకి సమీపంలోని మానేసర్‌లో సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. తొలివిడతలో స్వదేశానికి చేరిన వారిలో 211మంది విద్యార్థులు కాగా మరో 110 మంది వృత్తి నిపుణులు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సమాచారం.
ఎయిర్ ఇండియా ఇంతకు ముందు కూడా లిబియా, ఇరాక్, యెమెన్, కువైట్, నేపాల్ వంటి దేశాల నుంచి ఇలాంటి రెస్క్యూ విమానాలను నడిపింది.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌పై నాటక ప్రదర్శన