మనుషులు, పశువుల మధ్య అవినాభావ సంబంధం ఏళ్లుగా కొనసాగుతోంది. వ్యవసాయ పనుల్లో సాయపడుతూ.. మానవాళి మనుగడకు ఇతోధికంగా సాయం చేస్తున్నాయి పశువులు. వాటి సాయంతోనే ఏళ్లుగా మానవుల ఆకలి తీరుతోంది. అయితే నోరులేని మూగజీవాలను ఇష్టం వచ్చినట్లు కొట్టేవారు కొందరైతే, విశ్రాంతి లేకుండా పనులు చేయించేవారు మరికొందరు. దీనికి భిన్నంగా తమ పనుల్లో సాయం చేసే ఎద్దులకు వారంలో ఒకరోజు సెలవు ఇస్తున్నారు ఝార్ఖండ్ లాతేహార్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు. ఆదివారం సెలవు దినంగా నిర్ణయించి పనుల నుంచి విరామం కల్పిస్తున్నారు.
అవీ ప్రాణులే కదా..
లాతేహార్ జిల్లా హరఖ్ఖా, మోంగర్, లల్గఢీ, పక్రార్ సహా అనేక గ్రామాల్లో పశువులకు సెలవులివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఏదో ఓ కారణంతోనే పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని అమలుచేసేవారని భావిస్తూ ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. మనుషులకు ఏవిధంగా విశ్రాంతి కావాలో.. అలాగే జంతువులకు కూడా విరామం అవసరమని తీర్మానించారు. మనుషుల కోసం కష్టిస్తున్న నేపథ్యంలో వాటి బాగోగులను చూడటం తమ కర్తవ్యమని భావిస్తున్నారు.
మంచి సంప్రదాయం..
మనుషులు, పశువులు పరస్పర ఆధారితాలని.. ఒకరి క్షేమాన్ని మరొకరు చూడటం వల్ల ఇరు వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని లాతేహార్లోని పలు గ్రామాల ప్రజలు చెప్పుకొచ్చారు. అందుకోసమే పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని అమలు చేశారని.. ఇది చాలామంచి కార్యక్రమమని వెల్లడించారు.
సెలవు లేకుంటే రోగాల పాలు..
మనుషులకు విశ్రాంతి లేకుంటే ఎలా రోగాల బారినపడతారో.. అదే పరిస్థితి జంతువుల్లోనూ తలెత్తతుందని చెప్పారు లాతేహార్ పశుసంవర్థక శాఖ అధికారి రామ్ సేవక్ రామ్. జిల్లాలోని పలు గ్రామాలు అమలు చేస్తున్న విధానాన్ని అందరు పాటించాలని చెప్పారు.
ఇదీ చూడండి: దేశంలో కరోనా స్పీడు ఇంతలా ఎలా పెరిగింది?