సాధారణంగా బడి పరిసరాల్లో పీచుమిఠాయి, ఐస్‌క్రీమ్ డబ్బాలు దర్శనమిస్తాయి. పిల్లలు అవి చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన అంచట్గెరి గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నం. ఆ బడి గేట్లు తెరిచిన వెంటనే ఓ వ్యక్తి.. తన సంచితో అక్కడ నిలబడతారు. పిల్లలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. తమ దగ్గర ఉన్న ప్లాస్టిక్ సీసాలను ఆ సంచిలో వేసి వెళ్తారు. ఆ వ్యక్తి పేరు బసవరాజ్ బిద్నాల్. ఆయన ఆ ఊరి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు.
కర్ణాటకలో ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించి విజయం సాధించిన కొన్ని గ్రామాల్లో ముందువరుసలో ఉంటుంది అంచట్గెరి. ఒకప్పుడు పట్టి పీడించిన ప్లాస్టిక్ సమస్య నుంచి ఆ గ్రామాన్ని విముక్తి చేయడంలో... బసవరాజ్ ఆలోచనదే కీలక పాత్ర.
గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి పిల్లల సహాయం తీసుకున్నారు బసవరాజ్. బడి పిల్లలు సేకరించిన ప్లాస్టిక్ సీసాలు, చేతి సంచులు పంచాయతీ అధ్యక్షుడికి అందిస్తే.. వాటికి బదులుగా ఆయన వారికి 2 రూపాయలు ఇవ్వడం ప్రారంభించారు. దీని వల్ల గ్రామం పరిశుభ్రంగా మారింది. ఇలా ఇప్పటి వరకు 16వేల ప్లాస్టిక్ సీసాలను సేకరించడం విశేషం.
"తొలుత గ్రామంలో ఈ ఆలోచనను అమలు చేయడానికి ఎంతో ఇబ్బందిపడ్డాను. ప్లాస్టిక్‌ను నిషేధించడానికి గ్రామస్థులు అంగీకరించలేదు. పాఠశాల పిల్లల చేత గ్రామస్థుల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నించాం. మొత్తం 650 విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అప్పుడు వాళ్లలో మార్పు వచ్చింది. ఒక ప్లాస్టిక్ సీసా అందిస్తే రూ.2 ఇస్తామని ప్రకటించాం. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మార్చడానికి ఇది ఎంతో ఉపయోగపడింది."
--- బసవరాజ్, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు
బసవరాజ్ ప్రయత్నానికి మోదీ ప్రశంస...
భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ సబర్మతీ ఆశ్రమంలో నిర్వహంచిన ఓ వేడుకలో బసవరాజ్‌ను ఘనంగా సన్మానించారు. బసవరాజ్ చేస్తున్న కృషిని ఎంతో అభినందించారు.
అప్పటి నుంచి బసవరాజ్ ప్రసిద్ధి చెందారు. తన వద్దకు కళాశాల విద్యార్థులు కూడా వచ్చి.. ప్లాస్టిక్‌ను నిషేధించడానికి మరింత అనువుగా ఓ ప్లాస్టిక్-బ్యాంకును ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ఒకప్పుడు బసవరాజ్ ఆలోచనను వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు ఆయన వెంట నడుస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.