చెట్లపై అమితమైన ప్రేమతో ఓ వ్యాపారి.. ఉరుకుల పరుగుల జీవితంలోనూ తన ఇంటిని చిన్నపాటి అడవిగా మార్చేశాడు. కర్ణాటక, మంగళూరులోని కొడికల్‌కు చెందిన కృష్ణ గోవింద.. తన ఇంటిచుట్టూ 300 రకాల చెట్లు పెంచుతున్నాడు. పదవీవిరమణ తర్వాత, రెండేళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్న కృష్ణ గోవింద.. తన నివాసాన్ని గ్రీన్‌హౌజ్‌గా తీర్చిదిద్దుకున్నాడు.
"ఇక్కడ ఈ మొక్కలు నాటే సమయంలో స్థలం సరిపోక ఇబ్బందులు పడ్డా. ఇల్లు కట్టుకున్న తర్వాత మిగిలిన చోటులో మొక్కలు పెంచుకున్నా. నాలాగే ఇంట్లో చిన్నపాటి తోట పెంచుకోవాలి అనుకునేవారికి పూర్తి సహకారమందిస్తా."
-- కృష్ణ గోవింద, పర్యావరణ ప్రేమికుడు.
వాడేసిన వాటితో..
కృష్ణ గోవింద ఇల్లంతా మొక్కలు, చెట్లే కనిపిస్తాయి. ఈ విభిన్న రకాల మొక్కలన్నింటినీ.. ప్లాస్టిక్ సీసాలు, క్యాన్లు, పెయింట్ బకెట్లు, వెదురుబొంగులు, వాడేసిన కొబ్బరి టెంకల్లోనే పెంచుతున్నాడు కృష్ణ. తాను పెంచుకుంటున్న చిరుఅడవిలో, అన్నిరకాల పండ్లు, కూరగాయలు పండిస్తున్నాడు.
"వంటగదిలో వాడేసిన ఏ వస్తువూ వృథాగా పోకూడదు. ఆ వ్యర్థాలు పారేయడానికి బదులు, వాటిని ఎండబెట్టి, పేడతో కలిపి, మొక్కలకు అందించొచ్చు. మొక్కల పెరుగుదలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. "
--కృష్ణ గోవింద, పర్యావరణ ప్రేమికుడు
అలా ఆలోచన వచ్చింది...
కృష్ణ గోవింద కుటుంబం మూలాలు కేరళకు చెందినవే అయినా, పుట్టిపెరిగింది కర్ణాటక, ఉడుపి తాలూకాలోని కపూలో. గుజరాత్‌లో 35 ఏళ్లపాటు ఓ వ్యాపారం చేసిన కృష్ణ.. ఇటీవల స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ విరామ సమయంలో మొక్కలు, పొదలతో ఇంటిని నింపేయాలన్న ఆలోచన వచ్చింది. గుజరాత్ ఇంట్లో సైతం ఎన్నో మొక్కలు పెంచుకున్న కృష్ణ ఇప్పుడు పూర్తిస్థాయి గార్డెనర్‌గా అవతారమెత్తాడు. ఆయన ఇంట్లో పెరిగిన చిట్టడవిలో ఎన్నో పక్షులు, సీతాకోకచిలుకలు కనువిందు చేస్తాయి.
"నా తోటలో కుండీలలోనే నల్లమిరియాలు, మునక్కాడలు, వెనీలా పండించా. కుండీల్లోనూ వివిధ రకాల పండ్లు, కూరగాయల మొక్కలు పెంచే అవకాశముంటుంది. చెట్ల కొమ్మలపై వందల కొద్దీ సీతాకోకచిలుకలు, పక్షులు వాలతాయి."
-- కృష్ణ గోవింద, పర్యావరణ ప్రేమికుడు.
మానవ తప్పిదాలతో ఓవైపు పర్యావరణం ధ్వంసం అవుతుంటే, ఆ పర్యావరణ పరిరక్షణకు తనవంతు బాధ్యతగా రోజువారీ జీవితాన్ని మొత్తం కేటాయిస్తూ, మొక్కల పెంపకంలోనే ఆనందం వెదుక్కుంటున్నాడు కృష్ణ గోవింద.
ఇదీ చూడండి:'పవర్'ఫుల్ 'లక్ష్మీ' ప్రస్థానం ఎంతో ఘనం