ETV Bharat / bharat

దిల్లీ అల్లర్ల సమయంలో పోలీసుల తీరుపై విమర్శలు!

దిల్లీ సీఏఏ వ్యతిరేక ఘర్షణల్లో పోలీసుల వ్యవహార సరళిపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. పౌరచట్ట అనుకూల, వ్యతిరేక వర్గాల పరస్పర దాడులతో దిల్లీ అట్టుడుకుతున్న వేళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారన్న అపవాదు పోలీసులపై ఉంది. సంఘటిత నేరగాళ్ల వర్గమని రక్షకభట వ్యవస్థపై గతంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలను రుజువుచేసేలా ఇటీవలి దిల్లీ అల్లర్లలో పోలీసులు అవలంబించిన విధానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ ఆందోళనల్లో పోలీసుల వ్యవహార సరళిపై సమగ్రకథనం.

author img

By

Published : Mar 8, 2020, 8:08 AM IST

sub feature
రక్షక భటుల రాక్షసత్వం

విధి నిర్వహణలో క్రమశిక్షణను లక్షించి, భారత ప్రభుత్వం ఏనాడో 1977లో జాతీయ పోలీస్‌ సంఘాన్ని కొలువు తీర్చింది. 1979-81 సంవత్సరాలమధ్య అది మొత్తం ఎనిమిది నివేదికలు రూపొందించి కేంద్రానికి సమర్పించింది. ఆ సంఘం నిర్దేశాల ప్రకారం- పౌరులకు, చట్టానికి, వ్యవస్థకు రక్షకభటులు జవాబుదారీ కావాలి. ఇన్నేళ్ల తరవాతా దేశంలో ఆ స్ఫూర్తి కొల్లబోతూనే ఉంది. సామాజిక భద్రతా సాధనంగా మసలాల్సిన పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్ఠ భక్షక భటదళంగా పుచ్చిపోయింది. అది సంఘటిత నేరగాళ్ల వర్గమని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే లోగడ పడతిట్టిపోసింది. అంతగా పరువు మాసిన పోలీసులు అందుకు తాము నూటికి నూరుశాతం అర్హులమని దేశరాజధానిలో మళ్ళీ నిరూపించుకున్నారు. ‘ఇళ్లు దుకాణాలు తగలబడిపోతున్నాయి... వచ్చి ఆదుకోండి!’ అని నిస్సహాయ బాధితులు వేడుకుంటే- ‘ఆ మంటల్లో పడి మీరేం చావలేదుగా...’ అంటూ నిర్లక్ష్యపూరిత సమాధానాలిచ్చిన వైనం- పోలీసుల విధిద్రోహానికి అద్దం పట్టింది. ఆ బాగోతమేమిటో మీరే పరికించండి...

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టిన దిల్లీ ఈశాన్య ప్రాంతంలో ఫిబ్రవరి 24 రాత్రి రేగిన హింస, అల్లర్లు మూడు రోజులపాటు స్థానికులకు ప్రత్యక్ష నరకం చూపించాయి. మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, చాంద్‌బాగ్‌, యమునా విహార్‌ పరిసర ప్రాంతాల్లో పెచ్చరిల్లిన చిచ్చుకు ఒక పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌, ఓ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి సహా 53మంది పౌరులు బలయ్యారు. మరెందరో క్షతగాత్రులుగా మిగిలారు. అరాచక మూకలు వచ్చిపడ్డాయని వందల సంఖ్యలో పోలీసులకు ఫోన్లు వెళ్ళినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, ఆ దారుణ అలసత్వమే తమవాళ్లను పొట్టన పెట్టుకుందని బాధిత కుటుంబీకులిప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు.

అరాచకం పెచ్చరిల్లిన వేళ

మత విద్వేష హాలాహలం ఎగజిమ్ముతూ కత్తులు, ఇనుప రాడ్లతో దిగబడిన ముష్కర మూకలు ఇష్టారాజ్యంగా దమనకాండకు తెగబడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అయినవాళ్లను కోల్పోయిన అభాగ్యులు గుండెలు బాదుకుంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆ చుట్టుపక్కల దుండగులు 500 రౌండ్ల దాకా కాల్పులు జరిపారంటే, విధ్వంసక మూకలు ఎంత ఆయుధ సంపత్తితో వచ్చి ఎలా చెలరేగిపోయాయో వేరే చెప్పాలా? కత్తులు, రాళ్లు, కర్రలు, యాసిడ్‌ చేతపట్టి లూఠీలు, దహనాలు, హత్యలు, భయానక దాడులతో నరరూప రాక్షసులు విరుచుకుపడుతుంటే ‘మీ భద్రతకు మీదే బాధ్యత’ అని సెలవిచ్చి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నవాళ్ల ఒంటిమీద యూనిఫారాలకు, చేతిలో లాఠీలకు విలువేమిటి, గౌరవమెక్కడిది? దిల్లీ ఘర్షణలు హారర్‌ చిత్రాన్ని తలపిస్తున్నాయని కొందరు నేతలే ఈసడించారంటే- కాదనేదెవరు?

ప్రణాళిక ప్రకారమే

పథకం ప్రకారమే కొన్ని శక్తులు దిల్లీలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. నిజమే... నెత్తుటేళ్లు పారించిన ఘోరదురంతం వెనక మహాపాపం మూట కట్టుకున్నవాళ్ల నైచ్యంతోపాటు పోలీస్‌ నిష్క్రియనూ తూర్పారపట్టాల్సిందే. వీధుల్లో కాలిపోయిన వాహనాలు, పుస్తకాలు మసైపోయిన బడులు, ఛిద్రమైన జీవితాలు... వీటికి కారణమైన అల్లర్లను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా తప్పుపట్టింది. ‘విధి నిర్వహణకూ అనుమతి కావాలా’ అని నిగ్గదీసి- దిల్లీ పోలీసులకు స్వతంత్రత, వృత్తిపరమైన నైపుణ్యం కొరవడ్డాయని ముక్కచీవాట్లు పెట్టింది. న్యాయపాలిక ధర్మాగ్రహం దున్నపోతుపై వానగా మిగిలిపోతుండటం... జాతి ప్రారబ్ధం!

సమాధానాలేవి?

కర్కశ దాడుల పరంపరతో దిల్లీ గుండె విలవిల్లాడి, దేశం వెలుపలా దిగ్భ్రాంతి వ్యక్తమైన దరిమిలా, ఆలస్యంగా వెలుగుచూసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, వాటిపై కథనాలు ప్రసార సాధనాల్లో చక్కర్లు కొట్టాయి. ఒళ్లు గగుర్పొడిచే పోలీస్‌ విన్యాసాలను అవి దిసమొలతో ఆవిష్కరించాయి. ఇరవై మూడేళ్ల యువకుణ్ని పోలీసులు చితకబాదుతూ జాతీయ గీతం పాడమని అరవడం ఒక వీడియోలో రికార్డయింది. 36 గంటలపాటు అక్రమంగా నిర్బంధించాక అతణ్ని వదిలిపెట్టినా, ఒళ్లంతా పచ్చిపుండుగా మారిన ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కడుపుకోత భరించలేని తల్లి రోదిస్తోంది. దిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరాల్ని యూనిఫాం ధరించిన వ్యక్తులు బద్దలుకొడుతున్న దృశ్యాలు వీడియోల్లో నమోదయ్యాయి. 650కి పైగా కేసులు రిజిస్టర్‌ చేశామని, 1,820మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని, ఆయుధ చట్టం కిందా నాలుగు కేసులు పెట్టామని పోలీసులు ఇప్పుడు తీరిగ్గా లెక్కలు చెబుతున్నా- విపత్కాలంలో ఎందుకు మిన్నకుండిపోయారన్న ప్రశ్నకు సమాధానం లేదు, బహుశా ఎప్పటికీ రాదు!

కర్ఫ్యూ విధింపులోనూ అలసత్వమే..

ఎక్కడైనా మతఘర్షణలు ప్రజ్వరిల్లే అవకాశం ఉన్నట్లు భావించిన పక్షంలో అక్కడ తక్షణం కర్ఫ్యూ విధింపు లేదా నిషేధపుటుత్తర్వుల జారీ, అనుమానితుల ముందస్తు అరెస్టులు సహా అత్యవసర చర్యలు చేపట్టాలని నిబంధనలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 23 రాత్రి అల్లర్లు మొదలై రోజంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయాక 24 రాత్రి 144వ సెక్షన్‌ విధించడానికి పోలీసులు తీరిక చేసుకున్నారు. ఈశాన్య దిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో ఫిబ్రవరి 25 రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు. మతఘర్షణలకు సంబంధించిన నేరాల విచారణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, స్వేచ్ఛాయుత నిష్పాక్షిక పరిశోధన నిమిత్తం అవసరమైతే సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పరచాలని నిబంధనావళి చెబుతోంది. దిల్లీ ఘర్షణల కేసుల విచారణ బాధ్యతను ఇద్దరు వివాదాస్పద డిప్యూటీ కమిషనర్లు రాజేశ్‌ దేవ్‌, జాయ్‌ తిర్కేల నేతృత్వంలోని దళాలకు అప్పగించడాన్నిబట్టి- కానున్నదేమిటో బహిరంగ రహస్యమన్న విశ్లేషణలు ఇప్పటికే వినవస్తున్నాయి.

రాజకీయ బంధం తెగాల్సిందే!

దేశం నలుమూలలా రక్షకభట గణం దుష్టరక్షణకు శిష్ట భక్షణకు పాల్పడుతూ రాజకీయంగా పుచ్చి నైతికంగా చస్తున్న ఉదంతాలకు కొదవ లేదు. విధ్యుక్త ధర్మమైన శాంతిభద్రతల పరిరక్షణను గాలికొదిలేసి నేతాగణం మోచేతి నీళ్లు తాగుతూ, అక్రమ సెటిల్‌మెంట్లతో ఎడాపెడా వెనకేస్తున్న సిగ్గుమాలిన బాగోతాలూ లెక్కకు మిక్కిలి. రాజకీయ అజెండాల అమలులో పనిముట్లుగా దిగజారి ప్రజల ప్రాణాలను, సామాజిక విలువలను, భిన్నవర్గాల మధ్య సౌహార్దాన్ని బలిగొనే దౌర్భాగ్యాలకు దిల్లీ ఘర్షణల వంటివి ప్రబల దృష్టాంతాలు. ఊరూవాడా గగ్గోలు పుట్టి నానాయాగీ అయ్యాక తప్పనిసరై విచారణలకు ఆదేశించి కొన్నాళ్ల తరవాత ఎప్పుడో పరిహారమో మరొకటో ముట్టజెప్పినా- బాధితుల నష్టం పూడుతుందా, వారి మనసుకు తగిలిన గాయాలు మానతాయా? మరెప్పుడూ ఎక్కడా దిల్లీ తరహా అవాంఛనీయ ఘటనలు పునరావృతం కారాదంటే- పోలీసులకు రాజకీయ పేగుబంధం తెగిపోవాలి. అంతకన్నా ముందు మకిలంటిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడాలి!

సిఫార్సుల అమలు జాడేది..

జాతీయ నేర రికార్డుల బ్యూరో (2016) గణాంకాల ప్రకారం, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో 209మంది పోలీస్‌ అధికారులపై కేసులు నమోదయ్యాయి. అందులో యాభైమందిపైనే అభియోగ పత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలయ్యాయి. ఒక్కర్నీ దోషిగా నిర్ధారించలేదు! జనానికి మేలు జరిగేలా పోలీస్‌ యంత్రాంగాన్ని ఎలా తీర్చిదిద్దాలో లా కమిషన్‌, రెబీరో కమిటీ, పద్మనాభయ్య కమిటీ, జస్టిస్‌ మలీమత్‌ కమిటీ వంటివెన్నో విపులీకరించినా- మేలిమి సిఫార్సులపై సాలీళ్లు నిక్షేపంగా గూళ్లు అల్లుతున్నాయి. బ్రిటన్‌లోనో, అమెరికాలోనో పోలీసు యంత్రాంగం స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరించినట్లు కాకుండా- చట్టాన్ని చట్టుబండలు చేసినన్నాళ్లు, దేశంలో పౌరుల మౌలిక హక్కులు మంట కలుస్తూనే ఉంటాయి. ఏమంటారు?

రచయిత: బాలు

ఇదీ చూడండి: దిల్లీ హింసపై 690 కేసులు- 2,200 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.