కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో ఎవరి పౌరసత్వానికీ నూతన చట్టం భంగం కల్గించబోదని భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో నిర్వహించిన భాజపా ర్యాలీలో పాల్గొన్నారు షా. కాంగ్రెస్ హయాంలో పాకిస్థాన్ ఆగడాలకు అదుపు లేకుండా ఉండేదన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని.. పాకిస్థాన్ ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదులను అంతమొందించామని ఉద్ఘాటించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది. సోనియా, మన్మోహన్ సర్కారును నడిపారు. ఆ సమయంలో పాకిస్థాన్ నుంచి ప్రతిరోజూ ఉగ్రవాదులు చొరబడేవారు. సైనికులను బలిగొనే వారు. అప్పటి ప్రధాని స్పందించేవారు. భద్రతా దళాలకు రక్షణ ఉండేది కాదు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చింది. పాకిస్థాన్ తన చర్యలను అలాగే కొనసాగించాలనుకుంది. కానీ వాళ్లకు తెలియదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, భాజపా సర్కారు అని. మౌన రుషి మన్మోహన్ ఇప్పుడు ప్రధాని కాదు. నరేంద్ర మోదీ ప్రధాని. వాళ్లు తప్పు చేశారు. ఉరిలో దాడి చేశారు, పుల్వామాలో దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ సర్కారు 10 రోజుల్లోనే మెరుపు దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ ఇంట్లోకి చొరబడి ముష్కరులను మట్టుబెట్టింది."
-అమిత్ షా, హోమంత్రి.