జమ్ముకశ్మీర్ పరిస్థితులపై రకరకాల ఊహాగానాలు, ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు సమావేశమవనుంది. భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సమావేశమూ జరగనుంది.
సాధారణంగా మంత్రివర్గ సమావేశాలు బుధవారం జరుగుతుంటాయి. ఆకస్మికంగా ఈ సారి సోమవారం భేటీ కానుండటంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం అజెండాపై స్పష్టత లేకున్నా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే అధికరణలు 35-ఏ, 370 ని రద్దు చేసేందుకేననే ఊహాగానాలు జోరందుకున్నాయి. అధికారికంగా ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించనప్పటికీ అసాధారణ ప్రతిపాదనలు ఉండొచ్చని తెలుస్తోంది.
సమావేశాల నేపథ్యంలో...
అయితే.. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 7న ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు ఆమోదింపజేసుకునేందుకే మంత్రివర్గం సమావేశమవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి.. ఆమోదించేలా చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.