భారత సైన్యం... భారత వాయుసేన... ఎన్నో దశాబ్దాలుగా దేశ రక్షణలో ఈ రెండింటి పాత్ర ఎంతో కీలకం. తాజాగా.. చైనాతో సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ రెండు దళాలు కలిసి రంగంలోకి దిగాయి. తుర్పు లద్దాఖ్‌లో ఐకమత్యంతో ముందుకు సాగుతున్నాయి.
లేహ్‌లోని శిబిరంలో వాయుసేనకు చెందిన సీ-17, ఇల్యుషిన్-76, సీ-130జే సూపర్ హెర్క్యూలస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. చైనా సైన్యంతో పోరాడుతూ ఫార్వర్డ్ పోస్టుల్లో గస్తీ కాస్తున్న దళాలకు ఈ విమానాలు రేషన్లు, ఇతర వస్తువులను సరఫరా చేస్తున్నాయి.
ఆ మైత్రి కూడా కారణమేనా?
సైన్యం-వాయుసేన ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఐకమత్యంగా సాగడానికి మరో ఆశ్చర్యకర కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది... సైన్యాధికారి ముకుంద్ నరవణే, వాయుసేన సారథి మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా... నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకుంటున్న రోజుల నుంచి మంచి మిత్రులు కావడమే.
ఇదీ చూడండి:- భారత్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు పాక్ సాయం!
త్రిదళాధిపతి బిపిన్ రావత్‌ను నరవణే, భదౌరియా తరచుగా కలుస్తున్నారని, చైనాను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఓ అధికారి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఈ స్థాయి ఫలితాలకు ఇది కూడా ఓ కారణమన్నారు.
భారత్, చైనా సైనికులు.. సరిహద్దులో ప్రస్తుతం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత దగ్గరగా ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సైన్యం ఎప్పటికప్పుడు వాయుసేనకు చెబుతోంది. పరిస్థితులు చెయ్యి దాటిపోతే చేపట్టాల్సిన సంయుక్త ఆపరేషన్లపైనా ప్రణాళికలు రచిస్తున్నారు.
దేనికైనా రె'ఢీ'
వాస్తవాధీన రేఖకు చేరుకునే సరికి అత్యాధునిక ఛినూక్, అపాచీ హెలికాఫ్టర్లు దర్శనమిస్తాయి. ఇవి మానవ వనరులను, సామగ్రిని సరఫరా చేస్తున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు తగ్గేసరికి... భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా సంయుక్తంగా ఎదుర్కొనేందుకు సైన్యం-వాయుసేన సిద్ధంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- 'వర్చువల్ సిమ్'లతో కశ్మీర్లో కొత్త సవాళ్లు