విదేశీ విద్యార్థుల వీసాల ఉపసంహరణపై అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశంతో భారత్ ప్రస్తావించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి డేవిడ్ హేల్‌తో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఈ మేరకు చర్చించినట్లు తెలుస్తోంది.
అమెరికాలోని విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ తరగతులను పూర్తి స్థాయిలో నిర్వహిస్తే అందులో చదవి విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని అమెరికా ప్రకటించింది. దీని వల్ల భారతీయ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని హేల్‌తో ష్రింగ్లా వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సానుకూల స్పందన..
అమెరికా తరఫున ఈ విషయాన్ని పరిశీలిస్తామని హేల్ చెప్పినట్లు అధికారవర్గాలు తెలిపాయి. భారతీయ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. నిర్ణయ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పినట్లు సమాచారం. తాజా నిర్ణయానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు ఇంకా రాలేదని హేల్.. భారత్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
విదేశీ విద్యార్థుల్లో భయాలు..
ఇప్పటికే హెచ్-1బీ వంటి పలు వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధించిన అమెరికా ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయాల పునఃప్రారంభంపై ఒత్తిడి పెంచేందుకు అగ్రరాజ్య ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధమైంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైనట్లయితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విదేశీ విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
హిందూ-పసిఫిక్ ప్రాంతంపై..
ఈ భేటీలో హిందూ- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతికి కృషి చేస్తామని రెండు దేశాలు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించాయి. ఔషధాలతోపాటు ఆరోగ్య రంగంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించాయి.
ఇదీ చూడండి: విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్!