భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక ఆరుగురు అమెరికా అధ్యక్షులు దేశంలో పర్యటించారు. వీరిలో బరాక్ ఒబామా రెండుసార్లు వచ్చారు. త్వరలో రానున్న డొనాల్డ్ ట్రంప్ ఈ కోవలో ఏడో వ్యక్తి. అమెరికా అధ్యక్షుడయ్యాక ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24, 25 తేదీల్లో పర్యటిస్తున్నారు. ఇంతవరకూ మన దేశంలో పర్యటించిన అమెరికా అధ్యక్షులూ, వారి పర్యటనల వివరాలూ, ఆ సందర్భంగా కుదిరిన ఒప్పందాలూ...
1959- డ్వైట్ ఐసెన్‌హోవర్

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్. పార్లమెంటును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాల్లో 4 రోజులు పర్యటించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ... భారత్-అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో దీన్నో మైలురాయిగా అభివర్ణించారు.
1969- రిచర్డ్ ఎం.నిక్సన్

మనదేశంలో పర్యటించిన రెండో అమెరికా అధ్యక్షుడు నిక్సన్. ఆయన ఒక్క రోజులోనే దిల్లీలో పర్యటన పూర్తిచేశారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో ఉన్న పొరపొచ్చాలను తగ్గించుకోవడానికే ఈ పర్యటన జరిపినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా నిక్సన్ పాకిస్థాన్ పక్షం వహించడం గమనార్హం.
1978- జిమ్మీ కార్టర్

మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లో తన తల్లితో కలిసి కార్టర్ భారత్‌కు వచ్చారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో 3 రోజులు పర్యటించారు. బంగ్లాదేశ్ యుద్ధం, 1974లో భారత్ అణు పరీక్షల నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే ఉద్దేశంతోనే ఆయన పర్యటన జరిగినట్లు చెబుతుంటారు. అయితే ‘అణు’ మార్గాన్ని ఆపేయాలంటూ ఆయన భారత్‌ను కోరడంతో ఉభయ దేశాల సంబంధాలు మరింత బెడిసి కొట్టాయి. అణు విస్తరణ ఒప్పందంపై సంతకం పెట్టాలని అడగడం మొరార్జీ ప్రభుత్వానికి చికాకు తెప్పించింది. ఈ నేపథ్యంలో 1980లలో భారత్-అమెరికా సంబంధాలు సజావుగా సాగలేదు.
2000- బిల్ క్లింటన్

దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో భారత్‌కు వచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ అప్పట్లో భారత ప్రధానిగా ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, ఆగ్రా, జైపుర్, ముంబయిల్లో పర్యటన సాగింది. బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సియాతో కలిసి 5 రోజులు భారత్‌లో ఉన్నారు. రెండు దేశాల వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మెరుగయ్యేందుకు ఆయన పర్యటన కీలకంగా నిలిచింది. భారత్, పాక్‌ల మధ్య 1999 కార్గిల్ యుద్ధం విషయమై క్లింటన్ జోక్యాన్ని వాజ్‌పేయీ స్వాగతించారు.
2006- జార్జి డబ్ల్యూ బుష్

జార్జి బుష్ తన సతీమణి లారా బుష్‌తో కలిసి భారత్‌లో పర్యటించారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన కాలంలో.. 3 రోజుల పాటు దిల్లీ, హైదరాబాద్‌లలో ఆయన పర్యటించారు. అప్పట్లో బుష్ పార్లమెంటులో ప్రసంగించకూడదంటూ వామపక్షాలు వ్యతిరేకించడంతో.. దిల్లీలోని పురానా ఖిల్లా వద్ద ఎంపికచేసిన కొద్దిమందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం విధి విధానాలను ప్రధాని మన్మోహన్ సింగ్, బుష్‌లు ఖరారు చేశారు.
2010- బరాక్ ఒబామా

ఒబామా భారత్‌లో రెండు సార్లు పర్యటించారు. 2010లో తన తొలి పర్యటనలో ఉభయ దేశాల సంబంధాలు మరింత మెరుగు పడేందుకు బాటలు వేశారు. భారత పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద నిరోధక చర్యలు, వాణిజ్య అవకాశాలపై ఒబామా చేసిన ప్రకటనలు కీలకం. హై-టెక్నాలజీ సామగ్రి ఎగుమతులపై నియంత్రణను ఎత్తివేస్తూ.. ఇస్రో, డీఆర్‌డీవో, భారత్ డైనమిక్స్‌లను అమెరికా కంపెనీలతో వాణిజ్యాన్ని నిషేధించే సంస్థల జాబితా నుంచి తొలగిస్తూ ఆయన చేసిన ప్రకటనలను కొనియాడదగినవిగా చెబుతారు. ఈ అడుగులతోనే భారత్-అమెరికా కంపెనీల మధ్య రక్షణ, వ్యూహాత్మక సహకారానికి పునాది పడింది.
2015

ప్రధానిగా నరేంద్ర మోదీ తొలివిడత బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో మరోసారి ఒబామా తన సతీమణి మిషెల్‌తో కలిసి పర్యటించారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడు ఆయనే. భారత్‌లో రెండు సార్లు పర్యటించిన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా.. భారత్ తమకు ఎంత కీలకమో విస్పష్ట సంకేతాలిచ్చారు.