ఇప్పటికే దేశంలో పౌరసత్వ చట్టం... జాతీయ పౌర జాబితా అంశాలపై భారతీయుల్లో ఆందోళన నానాటికి పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మీ జనన ధ్రువీకరణ పత్రంలో చిరునామా 'పాకిస్థాన్ ' అని రాసి ఉంటే..? ఊహించుకోడానికే భయంగా ఉంది కదూ! గుజరాత్ అహ్మదాబాద్‌లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే తెచ్చిపెట్టింది.
పత్రం చూసి పరేషాన్..
అర్బజ్‌ఖాన్ పాతన్, మహెక్బాను పాతన్ దంపతులు వాత్వా రైల్వై క్రాసింగ్ సమీపంలోని చర్మాలియా సొసైటీలో నివసిస్తున్నారు. 2018 అక్టోబర్ 1న వీరికి కుమారుడు జన్మించాడు. మహ్మద్ ఉజర్ఖాన్గా నామకరణం చేశారు. ఇప్పుడు ఉజర్ వయసు 18 నెలలు. నానమ్మ షాలేహా బీబీ పాతన్ ఈ నెల 3న ఉజర్ జనన ధ్రువీకరణ పత్రాన్ని సేకరించింది. పత్రాన్ని చూసిన కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు.

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) జారీ చేసిన ఆ పత్రంలో.. చిరునామా గడిలో.. "పాకిస్థాన్ రైల్వే స్టేషన్ పక్కన.. "అని రాసి ఉండడం చూసి అవాక్కయ్యారు. తల్లిదండ్రలు భారతీయులైనప్పుడు.. కుమారుడు పాకిస్థాన్‌కు చెందినవాడెలా అవుతాడని విస్తుపోయారు.
అనధికారిక నామం..
వాత్వా రైల్వే క్రాసింగ్‌లో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని అనధికారికంగా "పాకిస్థాన్ క్రాసింగ్", "చోటా పాకిస్థాన్" అని పిలుస్తుంటారు స్థానికులు. ఇక్కడ సుమారు 2,200 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతం అధికారిక నామం "వసంత గజేంద్రగడ్కర్ నగర్ ఇడబ్ల్యూఎస్ హౌసింగ్". అయితే ఈ సంగతి తెలిసి కూడా.. అధికారులు అంత నిర్లక్ష్యంగా శిశువు జనన ధ్రువీకరణ పత్రంలో తప్పుడు చిరునామ ఎలా రాస్తారని మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు.
ఇదీ చదవండి:పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన కల్కి కొచ్చిన్!