కరోనా వ్యాక్సిన్ను ప్రాధాన్య క్రమంలో తమకే ముందుగా అందించాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్లో అధిక మరణాల రేటు ఉందని తెలిపారు. ప్రజల్లో ఎక్కువ మందికి ఇతర వ్యాధులు ఉన్నాయని పేర్కొన్నారు.
తీవ్రంగా ముప్పు ఉన్న వ్యక్తులతో పాటు వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారిని కాపాడేందుకు వ్యాక్సిన్ ఉపయోగించుకోవచ్చని అమరీందర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీకి అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందా అనే విషయంపై వివరణ కోరారు.
మోదీకి థ్యాంక్స్
వ్యాక్సినేషన్ కోసం ప్రాధాన్య జాబితా తయారు చేయడంలో సూచనలు ఇవ్వాలని కోరారు అమరీందర్. ఫ్రంట్లైన్ వర్కర్ల జాబితాలో భద్రతా దళాలు, మున్సిపల్ కార్మికులు, ప్రైమరీ స్కూల్ టీచర్లను చేర్చాలని సూచించారు. టీకా పంపిణీ కార్యక్రమం కోసం పంజాబ్ అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.