ఒక కెప్టెన్, 11మందితో కూడిన స్థిరమైన జట్టును ఎన్నుకుంటారో, లేక 40 మంది కెప్టెన్లతో కూడిన కూటమి కావాలో నిర్ణయించుకోవాలన్నారు కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ. భారతీయ జనతా పార్టీ ప్రచార గీతం 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' ను జైట్లీ విడుదల చేశారు.
భాజపా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు జైట్లీ. సోమవారం రోజు భాజపా మేనిఫెస్టోను విడుదల చేయనుందని స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం మధ్యతరగతిపై ఉన్న పన్నుల్ని క్రమంగా తగ్గిస్తుంటే కాంగ్రెస్ పెంచేందుకు యోచిస్తోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంలోనూ.. ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేయడంలోనూ విజయం సాధించిందన్నారు.
''మా ప్రధాన ప్రచారాస్త్రం... ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇందులో అన్ని పాయింట్లను మిళితం చేశాం. జాతీయ రక్షణ, మహిళా సాధికారత, మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల పథకం, సౌభాగ్య, గ్రామీణ విద్యుదీకరణ, అవినీతి, నల్లధనంపై పోరాటం, రైతులకు మద్దతు వంటి ప్రతీ విషయాన్ని చెప్పేందుకు ఏమాత్రం సంకోచించటం లేదు.''
-అరుణ్‌జైట్లీ, కేంద్రమంత్రి.