ఉత్తర్ప్రదేశ్లో అత్యంత హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో రెండున్నరేళ్ల పసిపాపను దారుణంగా హత్య చేశారు.
ఇలా వెలుగులోకి...
టప్పల్ ప్రాంతంలోని ఓ చెత్తకుప్పులో జూన్ 2న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. వీధి కుక్కలు బాలిక శరీర భాగాలను తీసుకురావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు... చిన్నారి ఇంటి సమీపంలోని వారేనని గుర్తించారు.
అప్పు వివాదమే హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించే అంశంలో వాదనలు పెరిగి.. అదే హత్యకు ఉసిగొల్పిందని సమాచారం.
''మే 31న బాలిక అపహరణ కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేశాం. అతడు నేరం అంగీకరించాడు. ఇది వ్యక్తిగత కక్షతోనే జరిగింది. హత్యాచారం సంకేతాలేమీ లేవు. చిన్నారి గొంతు నులిమి చంపారు. ఆమె కళ్లు బయటికొచ్చాయి. నిందితులిప్పుడు జైలులో ఉన్నారు.''
-ఆకాశ్ కుల్హరి, సీనియర్ ఎస్పీ- అలీగఢ్
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ఎస్పీ. ఐదుగురు పోలీసు అధికారులపై వేటు వేసినట్లు వెల్లడించారు.
బాలిక మృతికి నిరసనగా కుటుంబ సభ్యులు, బంధువులు.. రోడ్లపై బైఠాయించి ఆందోళనలకు దిగారు. గ్రామస్థులందరూ వారికి మద్దతుగా నినదించారు. రోదనలు మిన్నంటాయి. నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బాధితురాలి తల్లిదండ్రులు.
ఇదీ చూడండి: