ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అరుదైన ఘనతను సాధించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి బెంగళూరు మధ్య అత్యంత సుదూర ప్రయాణం చేసి విజయవంతంగా తిరిగి వచ్చారు. తమ ప్రయాణంలో ఎక్కడా ఆగకుండా విమానాన్ని నడిపారు.
మహిళా పైలట్లు కెప్టెన్ జోయా అగర్వాల్, తెలుగమ్మాయి కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావర్.. కెప్టెన్ శివాని మాన్‌హాస్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో తెల్లవారుఝామున వారి విమానం ల్యాండ్ అయ్యింది.
బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో మహిళా పైలట్లకు ఘనస్వాగతం లభించింది. దీనిపై పైలట్లు సంతోషం వ్యక్తం చేశారు.
"ఉత్తర ధ్రువాన్ని చేరి వచ్చి మేము చరిత్ర సృష్టించాం. మేము మాత్రమే కాదు మా బృందంలోని మహిళలంతా ఈ ఘనత సాధించారు. ఇందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈ ప్రయాణం వల్ల దాదాపు 10 టన్నుల ఇంధనం ఆదా అయింది."
-కెప్టెన్ జోయా అగర్వాల్
17 గంటల ప్రయాణం చేయడం చాలా గొప్ప అనుభూతి. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి అనుభూతిని పొందలేదు.
-శివాణి మాన్‌హాస్, నలుగురు మహిళా పైలట్లలో ఒకరు
శాన్‌ఫ్రాన్సిస్‌కో-బెంగళూరు భూమికి చెరో కొనల్లో ఉండగా, వీటి మధ్య దూరం 16వేల కిలోమీటర్లు. కఠిన వాతావరణ పరిస్ధితులు ఉండే ఉత్తర ధ్రువం సహా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ వీరు 17 గంటల్లో విజయవంతంగా విమానాన్ని బెంగళూరు చేర్చారు. ప్రపంచంలోనే ఎయిర్ ఇండియా లేదా ఏ ఇతర భారతీయ విమానయాన సంస్థ కానీ నడుపుతున్న అత్యంతసుదూర వాణిజ్య విమానం ఇదే.
ఇదీ చూడండి: ధైర్యమే తోడుగా.. 'ఉత్తర ధ్రువం' మీదుగా!