మంగళూరు విమానాశ్రయంలో కలకలం రేపిన బాంబ్ కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ఆదిత్యరావు బ్యాంకు లాకర్లో అనుమానాస్పద రసాయనం లభ్యమైంది. ఈ పొడి ప్రాణాంతకమైన సైనైడ్ మిశ్రమం అయి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్ లాకర్లో లభ్యమైన పొడిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
నిందితుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడని కుటుంబసభ్యుల వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడం కోసమే ఈ రసాయనాన్ని బ్యాంక్ లాకర్లో దాచాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితుడు గతంలో సంచరించిన పలు ప్రాంతాలు సహా ఉడుపిలోని బ్యాంకు లాకర్‌ను విచారణలో భాగంగా పోలీసులు పరిశీలించారు.
ఇదీ జరిగింది
కర్ణాటక మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల విశ్రాంతి గదిలో ఓ బ్యాగు గత సోమవారం కలకలం రేపింది. అందులో బాంబు ఉందన్న అనుమానంతో కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. బ్యాగులో ప్రమాదకర ఐఈడీని గుర్తించారు అధికారులు. వెంటనే అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేయించి.. బ్యాగును వేరే ప్రాంతానికి తరలించారు. ఐఈడీని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. ఈ కేసులో నిందితుడు ఆదిత్యరావ్.. బుధవారం బెంగళూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం విచారణలో భాగంగా రసాయనం అంశం బయటకు వచ్చింది.
ఇవీ చూడండి: మంగుళూరు విమానాశ్రయంలో బాంబు కలకలం