కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ఉన్న ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు విచారణ వాయిదా వేయడం కుదరదని సీబీఐ, ఈడీ సంస్థలకు చెప్పింది దిల్లీ కోర్టు.
వీరిద్దరితో సంబంధమున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ కేసును వాయిదా వేయాలని సీబీఐ, ఈడీ దిల్లీ కోర్టును అభ్యర్థించాయి.
గత ఏడాది కాలంగా ఇవే కారణాలు పదే పదే వినడం ఇబ్బందికరంగా ఉందని సీబీఐ,ఈడీలపై అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఓపీ సైనీ. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును సెప్టెంబరు 3కు వాయిదా వేశారు. అప్పటివరకు చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను పొడిగించారు.
సెప్టెంబరు 3లోగా సీబీఐ, ఈడీలు ఎప్పుడైనా తమ వాదనలను వినిపించవచ్చని తెలిపింది దిల్లీ కోర్టు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు, ఐఎన్ఎక్స్ మీడియా కేసులు విభిన్నమని చెప్పింది. ఈ రెండు కేసులకు విదేశీ పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులతో సంబంధం ఉందని సీబీఐ, ఈడీ వాదించగా.. అలాంటి విషయాలు వందల సంఖ్యలో ఉంటాయని దిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి: ఐఎన్ఎక్స్ స్కామ్: ఈడీ కేసులో చిదంబరానికి ఊరట