కరోనా మహమ్మారి వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పరిశోధనలు ముమ్మరం చేశాయి. ఈ వైరస్ పై కొంత మేర ప్లాస్మా థెరపీ ప్రభావం చూపుతోందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 చికిత్స కోసం ఆ విధానంపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సిద్ధమవుతోంది అఖిల భారతీయ వైద్య విద్యా సంస్థ (ఏఐఐఎంఎస్). డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతుల కోసం నివేదికలు ఇప్పటికే సిద్ధం చేసింది.
కొవిడ్-19 చికిత్స కోసం ప్లాస్మా థెరపీ విధానం ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా తెలిపారు.
"ఈ విధానాన్ని ప్రయోగించే ముందు సరైన ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఈ పద్ధతిని సిఫార్సు చేయొచ్చు. కొవిడ్-19 రోగులపై ప్లాస్మా థెరపీ సామర్థ్యం తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌తో ఎయిమ్స్ కలిసి పనిచేస్తోంది. ఈ పరిశోధన కోసం అన్ని సంస్థలు ఐసీఎంఆర్, డ్రగ్ కంట్రోలర్ వద్ద అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్లాస్మా థెరపీ అనేది.. ఇతర థెరపీలు, చికిత్సలకు అనుబంధంగా కొంత మేర ఫలితాలను ఇస్తోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి."
-డా.రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
తగినన్ని యాంటీబాడీలు ఉన్నప్పుడే..
భద్రతాపరంగా ఫ్లాస్మా థెరపీపై పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు గులేరియా. అవసరమైనన్ని రోగనిరోధక యాంటీబాడీలను కరోనా రోగులకు ఇచ్చినప్పుడే ప్రయోజనం ఉంటుందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో తగినన్ని యాంటీబాడీలు ఉన్నాయా లేదా అని పరీక్షించకుండా ప్లాస్మా థెరపీ చేస్తే.. మంచికి బదులు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
ఇదీ చూడండి: వైద్యులకు, వైరస్‌కు మధ్య అడ్డు 'పెట్టె'