కరోనా నియంత్రణకు నిరంతరం నిర్విరామంగా పోరాడుతున్నారు దేశంలోని వైద్య సిబ్బంది. వీరికి సరైన రక్షణ సదుపాయాలు కల్పించాలని ప్రతిఒక్కరు కోరుకుంటున్నారు. అయితే దిల్లీలోని ప్రసిద్ధ ఎయిమ్స్ ఆస్పత్రి తీసుకున్న ఓ నిర్ణయంపై పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎయిమ్స్‌లో పనిచేసే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సహాయ సిబ్బంది ప్రతి ఒక్కరికి కరోనా నుంచి రక్షణగా ఎన్-95 మాస్కులు అందించనున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఒక్కో మాస్కును శానిటైజ్ చేసుకుని, లేదా ఇతర పద్ధతుల్లో శుభ్రం చేసుకుని... కనీసం నాలుగుసార్లు వినియోగించాలని సూచించింది. అలా అయితే ఎక్కువ రోజుల పాటు ఒకే మాస్కును ఉపయోగించవచ్చని పేర్కొంది.
ఇదేం తీరు?
ఈ మార్గదర్శకాలను తప్పుబట్టారు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. శ్రీనివాస్ రాజ్‌కుమార్. ఒక్కో మాస్కును 4 సార్లు వినియోగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో రోగులకు చికిత్స చేసేటప్పుడు వినియోగించిన మాస్కును ఇంటికి తీసుకెళ్తే ప్రమాదమని చెబుతున్నారు.
కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తూ దిల్లీలో వైద్యులు సహా 35 మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. ఎయిమ్స్‌లోని ఓ వైద్యునికి కూడా వ్యాధి సోకింది. గర్భవతి అయిన అతని భార్యకు, సోదరునికి కూడా వ్యాపించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ఎన్-95 మాస్కును అతి తక్కువగా పునర్వినియోగించాలి. కొద్ది గంటల పాటు దీనిని ఉపయోగిస్తే అసౌకర్యంగా ఉంటుంది.