తమిళనాడు ప్రభుత్వ ముఖచిత్రం మారనుందా? అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోనుందా? స్టాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ తెరదించారు తమిళ ఓటర్లు. 22 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పళని-పన్నీరు వర్గాన్ని గట్టెక్కించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు అవసరమైన మ్యాజిక్ సంఖ్యను అందించారు. ఫలితంగా ప్రభుత్వాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది అన్నాడీఎంకే.
శాసనసభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనందున... ఈ ఉపఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశించిన డీఎంకేకు నిరాశే ఎదురైంది. ఆద్యంతం అధికారి పార్టీ గుండెల్లో గుబులు పుట్టించిన స్టాలిన్ వర్గం చివరకు ప్రతిపక్షానికే పరిమితం కాక తప్పలేదు.
గండం తప్పింది...
ప్రస్తుతం శాసనసభలో 114 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకే... మ్యాజిక్ సంఖ్య(117)కు అవసరమైన మరో మూడు స్థానాలను సంపాదించుకుంది. ఫలితంగా ప్రభుత్వం కూలిపోయే గండం నుంచి బయటపడింది. మరిన్ని స్థానాల్లోనూ గెలుపొందే అవకాశముంది.
ప్రతిపక్ష డీఎంకే నుంచి అధికార వర్గానికి గట్టిపోటీ ఎదురైంది. మ్యాజిక్ సంఖ్యకు అవసరమైన స్థానాల్లో విజయం సాధించడంలో మాత్రం డీఎంకే విఫలమైంది. మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిపి 97 మంది ఎమ్మెల్యేలున్న డీఎంకే... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 20 సీట్లు అవసరం.
కమల్, దినకరన్ ప్రభావం లేదు...
శశికళ మేనల్లుడు దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే, సినీ నటుడు కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.
లోక్‌సభలో వార్ వన్‌సైడ్
38 లోక్‌సభ స్థానాల్లో మాత్రం డీఎంకే దూసుకెళ్లింది. అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. డీఎంకే అధినేత కరుణానిధి లేకపోయినప్పటికీ... స్టాలిన్ పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.