తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ తమ అభ్యర్థులకు నూతన విధివిధానాలు రూపొందించింది. పార్టీలో ఉన్నత స్థానాలు సహా అన్ని పదవులకు పోటీ చేయాలంటే వరుసగా ఐదేళ్లు పార్టీ సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అనుబంధ చట్టాలకు సవరణలు చేసింది. పార్టీ సాధారణ మండలి, నిర్వాహక కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంది.
శశికళను దూరం చేసేందుకే!
జయలలిత నెచ్చెలి శశికళ సహా ఆమె అనుచరులు పార్టీ పదవులను ఆశించకుండా చేయడానికే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరు కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. నూతన నిబంధన కారణంగా ఆమె విడుదల తర్వాత ఐదేళ్ల వరకు కీలక పదవుల్లో పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. జయలలిత మరణాంతరం పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు శశికళ. 2017లో పళనిస్వామి, పనీర్‌సెల్వం వర్గాలు రెండు ఒకటిగా కలిసిన సమయంలో శశికళను ఆ పదవి నుంచి తొలగించారు.